సీఎం రేవంత్ కీల‌క నిర్ణ‌యం.. 28 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న‌

సీఎం రేవంత్ కీల‌క నిర్ణ‌యం.. 28 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న‌

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుంచి జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు ప్ర‌జాపాల‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను రేవంత్ ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిప‌ల్ వార్డుల్లో ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

ఆదివారం స‌చివాల‌యంలోని ఏడో అంతస్తులోని డోమ్ స‌మావేశ మందిరంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో సీఎం రేవంత్ స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే, ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై అధికారులతో సీఎం కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత.. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ‘ప్రజా వాణి’ నిర్వహిస్తున్నారు. ప్రజా భ‌వ‌న్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తోంది. భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజా భవన్ కు వస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ‘ప్రజా పాలన’కు శ్రీకారం చుట్టారు.