కేసీఆర్ దుష్ట పాలన అంతం చేయాలి: ప్రొఫెసర్ కోదండరామ్

కేసీఆర్ దుష్ట పాలన అంతం చేయాలి: ప్రొఫెసర్ కోదండరామ్

– ఉద్యమకారులు కీలకపాత్ర పోషించాలి

– తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో గత 10 ఏండ్లుగా దోపిడీ చేస్తున్న కేసీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం వల్లనే బీఆర్ఎస్ ను ఓడించగలమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. టీజేఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిల్లా రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఆదివారం హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడంలో ఉద్యమకారుల పాత్రపై మాట్లాడారు. పేపర్ లీకులతో పాలన చేస్తూ తెలంగాణలో ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్లు చెపుతున్న కేసీఆర్ తప్పుడు లెక్కలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ధరణి తీసేస్తారని, ధరణి తీసేస్తే రైతులకు నష్టమని బెదిరిస్తున్న కేసీఆర్ మాటలు నమ్మొద్దని అన్నారు.


ఎంతో ప్రాచుర్యం కలిగిన అభివృద్ధిని కావాలనే కాలరాచాడని, జిల్లా పేరుతో నగరాన్ని రెండు ముక్కలు చేసి ఓరుగల్లు చరిత్రను కావాలనే కనుమరుగు చేసిన కేసీఆర్ ను ఓడించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీర్ఘకాలిక చరిత్ర, అనుభవం కలిగిన మేం దుష్ట పాలనను అంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మద్దతు పలుకుతున్నామని అన్నారు. రానున్న కాలంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగించాలని, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ఉద్యమకారుల అభివృద్ధి బోర్డును నియమించడం లాంటి ముఖ్యమైన విషయాల అమలుతో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఉద్యమకారులు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకమై బీఆర్ఎస్ దుష్టపాలనను అంతం చేయడం కోసం రానున్న 25 రోజులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునచ్చారు.


తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో దోపిడీ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ ప్రజలకు ఉద్యమ నాయకులుగా నాయకత్వం వహించి దుష్ట పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. కోదండరామ్ లాంటి ఉద్యమకారులను అణచివేసి, ఉద్యమ ద్రోహులకు అధికార పదవులిచ్చిన కేసీఆర్ నేడు ఉద్యమకారులను బైండోవర్ పేరుతో వేధింపులు చేస్తున్నాడని, ఇంతటి దుష్ట పాలనను అంతం చేయడానికి ఉద్యమకారులు ప్రతిన బూనాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, వరంగల్ జిల్లా అద్యక్షులు జావీద్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పత్తి, మహబూబాబాధ్ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అద్యక్షులు రత్నం కిరణ్, జనగామ జిల్లా అధ్యక్షులు అశోక్ వర్ధన్ రెడ్డి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు బొనగాని రవీందర్, గుంటి రామ్ చందర్, పిల్లి సుధాకర్, బైరి రమేశ్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర సమన్వయకర్త సాయిని నరేందర్, రాష్ట్ర కన్వనర్ చింతకింది కుమారస్వామి, సోమ రామమూర్తి, పటేల్ వనజ, సాంబరాజు మల్లేశం, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నగేష్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నున్న అప్పారావు, న్యాయవాదులు పులి సత్యనారాయణ, జీఆర్ శ్రీనివాస్, రాచకొండ ప్రవీణ్, చింత నిఖిల్ కుమార్, బిక్షపతి, సతీష్, శ్యాంకృష్ణ, కంప వినోద్, సంజీవ్, ప్రజా సంఘాల నాయకులు తుపాకుల దశరథం, మంద వీరాస్వామి, మైస శ్రీనివాస్, కేడల ప్రసాద్, స్రవంతి, సద్గుణ, శాగంటి మంజుల, తెలంగాణ కొమరయ్య, దామెర గట్టయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.