డబ్బు సంచులతో గెలవాలని చూస్తున్నారు: మంథని బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్
ఏం చేస్తరో... ఏం చేసిండ్లో చెప్పలేనోళ్లు కాంగ్రెస్ నాయకులు. గ్యారెంటీ లేని పథకాలను మోసుకొచ్చి, డబ్బు సంచులతో గెలువాలనే చూస్తాండ్లు.

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: ఏం చేస్తరో… ఏం చేసిండ్లో చెప్పలేనోళ్లు కాంగ్రెస్ నాయకులు. గ్యారెంటీ లేని పథకాలను మోసుకొచ్చి, డబ్బు సంచులతో గెలువాలనే చూస్తాండ్లు. ఆపార్టీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మంథని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. బుధవారం ముత్తారం మండలకేంద్రంలోని వెంకటలక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల్లో విశ్వాసం, నమ్మకం లేకనే ఈనాడు మన సైన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కొత్త కొత్త అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, కేవలం గ్యారెంటీ లేని ఆరు పథకాలు, డబ్బు సంచులతో గెలువాలనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్సోళ్లు ప్రజలు నమ్మేలా అబద్దాలు చెబుతున్నారని, కానీ మనం ఇంత అభివృద్ది చేసినా చెప్పుకోవడంలో వెనుకబడి పోయామన్నారు. మరో 30 రోజుల దీక్షతో ఎన్నికలను దిగ్విజయం చేయడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులను వెదజల్లుతూ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఎన్నికలు రాకముందే ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొంటున్న తీరు ఆపార్టీ హీన చరిత్రను అర్థం చేసుకోవాలన్నారు. మన ఓట్లతో అధికారంలోకి వచ్చి పదవులు పొందినోళ్లు మన ఆకలి తీర్చాలని ఏనాడూ ఆలోచన చేయలేదని, కనీసం రూపాయి సాయం చేయని వాళ్లు ఈనాడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం పైసలు వెదజల్లుతున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. 60 ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే, పదేండ్ల సుపరిపాలన అందించిన బీఆర్‌ఎస్ ఎంతో గొప్పదని, పిడికిలి బిగించి మీరంతా ముందుకు సాగితే ఆపేవారు ఎవరూ లేరనే విషయాన్ని గ్రహించాలన్నారు.