మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను ప‌రిశీలించిన‌ రాహుల్‌

మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను ప‌రిశీలించిన‌ రాహుల్‌
  • అగ్ర‌నేత‌ ఒక్క‌రికే బ‌రాజ్ ద‌ర్శ‌న‌కు అనుమ‌తి
  • బ‌రాజ్ సంద‌ర్శ‌న‌కు కాంగ్రెస్ శ్రేణుల య‌త్నం
  • అడ్డుకున్న పోలీసులు.. అక్క‌డ ఉద్రిక్త‌త‌త‌


విధాత‌: ఇటీవ‌ల కుంగిన మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ గురువారం ఉద‌యం ప‌రిశీలించారు. మేడిగడ్డ బ‌రాజ్‌ 16వ పిల్లర్ నుంచి 20 వరకు కుంగిపోయిన ప్రాంతాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. బ‌రాజ్ ప‌రిశీల‌న‌కు రాహుల్ ఒక్క‌రినే అనుమ‌తిచ్చారు. ఆయ‌న వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉన్నారు. మ‌రెవ‌రినీ బ‌రాజ్ సంద‌ర్శ‌న‌కు అనుమ‌తించ‌లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ‌రాజ్‌ కుంగిపోవడం వెనుక డిజైనింగ్, నిర్మాణ లోపాలే కారణమని ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర బృందం ప్రాథమికంగా నిర్ధారించిన నేప‌థ్యంలో రాహుల్ ప‌ర్యట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

బ‌రాజ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌


రాహుల్‌గాంధీ మేడిగ‌డ్డ బ‌రాజ్ సంద‌ర్శ‌నకు వ‌చ్చిన నేప‌థ్యంలో కాంగ్రెస్ నాయ‌కులు సైతం బ‌రాజ్ సందర్శ‌న‌కు పెద్ద సంఖ్య‌లో గురువారం ఉద‌యం అక్క‌డికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వారిని ఎక్క‌డిక‌క్కడ‌ అడ్డుకున్నారు. మేడిగ‌డ్డ బ‌రాజ్‌కు వ‌చ్చే అన్ని ర‌హ‌దారుల‌కు అడ్డంగా భారీ కేడ్లు పెట్టి కాంగ్రెస్ శ్రేణుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. బ‌రాజ్ కూలిన ప్రాంతానికి వెళ్ల‌డానికి ప్ర‌జ‌ల‌కు అనుమ‌తిని నిరాక‌రించారు. బ‌రాజ్ వ‌ద్ద 144 సెక్ష‌న్ విధించినందున అనుమ‌తించబోమ‌ని పోలీసులు చెప్పారు.


నాసిర‌కంగా క‌ట్టిన ప్ర‌జా ఆస్తులను ప‌రిశీలించేందుకు ప్ర‌జ‌ల‌ను అడ్డుకోవ‌డం ఏమిట‌ని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పోలీసులపై మండిప‌డ్డారు. కొంద‌రు మ‌హిళ‌లు బారీ కేడ్లు తోసుకొని ముందుకెళ్లారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌తో కాంగ్రెస్ నాయ‌కులు, మ‌హిళ‌లు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు, కాంగ్రెస్ నాయ‌కులు రోడ్డుపై భైఠాయించిన పోలీసుల తీరుపై నిర‌స‌న తెలిపారు. ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. కాంగ్రెస్ శ్రేణుల‌ను పోలీసులు అక్క‌డి నుంచి పంపించి వేయ‌డంతో కొద్ది సేప‌టి త‌ర్వాత ఉద్రిక్త‌త స‌ద్దుమ‌ణిగింది.