తెలంగాణలో ‘రెడ్‌ అలర్ట్‌’ నియోజకవర్గాలివే!

సున్నితమైన నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అతి సున్నితమైనవీ ఉంటాయి. అక్కడి శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల విభాగం అధికారులు వీటిని ఆయా పేర్లతో గుర్తిస్తుంటారు.

తెలంగాణలో ‘రెడ్‌ అలర్ట్‌’ నియోజకవర్గాలివే!

హైదరాబాద్‌: సున్నితమైన నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అతి సున్నితమైనవీ ఉంటాయి. అక్కడి శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల విభాగం అధికారులు వీటిని ఆయా పేర్లతో గుర్తిస్తుంటారు. అక్కడ భద్రతకు, పోలింగ్‌ సక్రమ నిర్వహణకు మరింత కేంద్రీకరించి పని చేస్తుంటారు. ఇలానే.. కొన్నింటిని రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలుగా గుర్తిస్తుంటారు.

ఇలా గుర్తించడానికి ఒక కొలబద్ద ఉంటుంది. అదే అక్కడ పోటీచేసేవారిలో నేర చరితులు, వారిపై ఉన్న కేసుల సంఖ్య. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న దాదాపు 23శాతం అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు తెలిపాయి.

మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 96 నియోజకవర్గాలను ఏడీఆర్‌ రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలుగా పేర్కొన్నది. అందులో హైదరాబాద్‌లోని 15 సీట్లలో 11 ఇదే క్యాటగిరీకి వస్తాయని తెలిపింది. రాజకీయాల్లో నానాటికీ విలువలు తగ్గిపోతున్నాయి. గతంలో ఎన్నికల్లో నిలబడేవారిలో అత్యధికులు స్వచ్ఛమైన నడవడిక ఉండి.. పార్టీ సిద్ధాంతాలకు కట్టబడి పనిచేసేవాళ్ల అయి ఉండేవారు. కానీ.. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ డబ్బు, కండబలాన్ని ఉపయోగిస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గం అంటే?

ఏదైనా నియోజకవర్గంలో ముగ్గురు అంతకు మించిన సంఖ్యలో అభ్యర్థులు నేరచరిత్ర కలిగి ఉంటే దానిని ఏడీఆర్‌.. రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గంగా అభివర్ణిస్తున్నది. అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. నేరచరిత్రను వెల్లడించని అభ్యర్థులు ఈసీ నుంచి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. ఏడీఆర్‌, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకారం.. ప్రస్తుతం పోటీలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల్లో 521 మంది (23%) నేర చరిత్ర కలిగి ఉన్నారు. గత ఎన్నికల్లో 66% నియోజకవర్గాలు రెడ అలర్ట్‌ ముద్రపడగా.. ఈసారి అది 81శాతానికి పెరగడం ఆందోళనకరంగా పరిణమించింది. ఏడీఆర్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 72%, బీజేపీ అభ్యర్థుల్లో 71%, బీఆరెస్‌ నుంచి పోటీచేస్తున్నవారిలో 48శాతం, బీఎస్పీ అభ్యర్థుల్లో 37 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌కు పరిమితమైన ఎంఐఎం అభ్యర్థుల్లో 56శాతం మందిపై కేసులు ఉన్నాయి. అభ్యర్థుల పరంగా తీవ్రమైన కేసులు ఉన్నవారి సంఖ్య చూస్తే.. 15శాతం పెరిగింది. ఈ తీవ్రమైన కేసులలో హత్య కేసులు ఎదుర్కొంటున్నవారు ఏడుగురు ఉంటే.. హత్యాయత్నం కేసులు 27, మహిళలను వేధించిన కేసులు 45 ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి టీ రాజాసింగ్‌ ఉన్నారు. ఆయనపై 87 కేసులు ఉన్నాయి. బీజేపీ నేత బండి సంజయ్‌పై 59 కేసులు ఉన్నాయి.  

హైదరాబాద్‌లో రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలివే..

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు సెగ్మెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం కూడా కలుపుకొంటే మొత్తం 15 సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో ముషీరాబాద్‌ (కేసులు ఉన్నవారు 8), జూబ్లీహిల్స్‌ (7), కార్వాన్‌ (7), ఖైరతాబాద్‌ (5), అంబర్‌పేట (5), చార్మినార్‌ (5), గోషామహల్‌ (5), చాంద్రాయణగుట్ట (4), మలక్‌పేట (4), నాంపల్లి (4), యాకుత్‌పుర (3) రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు.