రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడనుంది

రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడనుంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున ఈ స్థానానికి ఎన్నికలు జరిగిన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ను అధికారులు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి పోటి పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు మొత్తం 1439 మంది ఉన్నారు. అందులో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. 2021లో ఉన్న మొత్తం ఓటర్ల కన్నా సంఖ్య కొంత తగ్గింది. ఇద్దరు మాత్రమే ఓటు వేయలేదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒకరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఒకరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును వినియోగించుకోలేదు. ఈ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.