లాజిక్ మిస్ అయి, కామన్‌సెన్స్ కోల్పోయి మాట్లాడుతున్న కేసీఆర్: రేవంత్

- మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తులపై నెపం పెట్టి తప్పుకోవాలని చూస్తున్నారు.
- బీఆరెస్‌ను కాపాడేందుకు కేంద్రం యత్నం
- నివేదికను అందుకే బయట పెట్టడం లేదు
- క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలి
- పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్
విధాత, హైదరాబాద్: సీఎం కేసీఆర్ లాజిక్ మిస్ అయి, కామన్‌సెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ ఎద్దేవా చేశాడు. బాంబులు పెడితే, పేళుళ్లు జరిగితే పైకి లేస్తుంది కానీ కుంగిపోదని అన్నారు. మావోయిస్టలు, సంఘ విద్రోహ శక్తులపై నెపం పెట్టి తప్పుకోవాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు భూమిలోకి కుంగింది? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ వద్ద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉంన్నాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉందన్నారు. సాయిల్ టెస్ట్ వంటి జాగ్రత్తలు పాటించలేదన్నారు. గాల్లో మేడలా మేడిగడ్డ ప్రాజెక్ట్ ను నిర్మించారని ఆరోపించారు. మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులు చేశారని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఈఎన్సీ మురళీధర్ రావు 12 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారని, కేసీఆర్ కి, మురళీధర్ రావుకి ఉన్న సంబంధమేంటని నిలదీశారు. దోచుకునేందుకు ఇలాంటి అధికారులను పెట్టుకున్నారని విమర్శించారు.
ఇంత ప్రమాదం జరిగితే ఎల్ఆండ్ టీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారిని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని ప్రశ్నించారు.ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగింది అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు మేడిగడ్డను పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ బిల్లా రంగా లాంటివారని.. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని ఎద్దేవా చేశారు. వాళ్లేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తే కొడంగల్ లో పోటీకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ లో పోటీ చేయాలని కేసీఆర్ ను ఆహ్వానించానని… కొడంగల్ లో పోటీకి కెసిఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే తానైనా, భట్టీ విక్రమార్క అయినా.. కామారెడ్డిలో కెసిఆర్ పై, సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లను చిత్తుగా ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్ కు అవకాశం ఇవ్వలేదని… తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని.. 2/3 మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్ లాంటిదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్ కలిసి పోటీ చేస్తాయి. వారి మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయడం ప్రాసెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు . అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అనుకూల ప్రభుత్వం ఉంది, అందుకే ఇక్కడ ఎటువంటి దాడులు ఉండవన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడీ, సీబీ లు ముందు వెళ్తాయన్నారు.
కాంగ్రెస్ ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిని ఎండగడతామని చాలామంది నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుంది అని నమ్మి బీజేపీలోకి వెళ్లరన్నారు. కానీ అవినీతి సొమ్ములో బీజేపీ, బీఆరెస్ భాగస్వాములని తెలుసుకున్న వారంతా అక్కడ సాధ్యం కాదని నమ్మి తిరిగి వెనక్కి వస్తున్నారని తెలిపారు.
రాజ్ గోపాల్ రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని స్పష్టం చేశారు. గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా…. కాంగ్రెస్ లోకి రావాలనుకునే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ లో చేరే వారికి స్థాయిని బట్టి పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. బీజేపీ.. జనసేనతో పాటూ కే.ఏ.పాల్ ను కూడా కలుపుకుంటే బాగుండేదని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.