ఉమ్మ‌డిగా నాయ‌క‌త్వం.. కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు

ఉమ్మ‌డిగా నాయ‌క‌త్వం.. కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు
  • తెలంగాణ ముఖ్య‌నేత‌ల‌తో
  • ఏఐసీసీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో విజ‌యావ‌కాశాల‌పై న‌మ్మ‌కంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. రాష్ట్ర నాయ‌క‌త్వం విష‌యంలో ఆచితూచి అడుగులే వేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది. పార్టీలో ఒకే ఒక్క‌డు అనే సిద్ధాంతం లేద‌ని, ఉమ్మ‌డి నాయ‌క‌త్వంలోనే ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌ని సంకేతాలు ఇస్తున్న‌ది. ఏఐసీసీ కార్యాల‌యంలో గురువారం తెలంగాణ నాయ‌కులు ఉమ్మ‌డిగా ప్రెస్‌మీట్ నిర్వ‌హించ‌డందీనికి నిద‌ర్శ‌నంగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. త‌ద్వారా పీసీసీ అధ్య‌క్షుడి నుంచి మొద‌లు కొని ప్ర‌తి ఒక్క‌రు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులేన‌న్న అభిప్రాయం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బ‌హుళ నాయ‌క‌త్వం సిద్ధాంతం ప్రాతిప‌దిక‌న పార్టీ ప‌ని చేస్తుంద‌ని చెప్ప‌డ‌మే దీని ఉద్దేశ‌మంటున్నారు. ఎవ‌రైనా నాయ‌కులు బెదిరించినా, బ్లాక్ మెయిల్ చేసినా ప‌ట్టించుకోవ‌ద్ద‌న్న తీరుగా పార్టీ అధిష్ఠానం ఉన్న‌ద‌ని ప‌రిశీల‌కు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జాక్షేత్రంలో బ‌లం ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించి వారికి పెద్ద పీట వేస్తోంది. ఇలా వివిధ ప‌ద్ధ‌తుల్లో బ‌హుళ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని చెబుతున్నారు.

అంద‌రి అభిప్రాయాల‌తో లిస్టులు!

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల రెండ‌వ జాబితాపై క‌స‌ర‌త్తులో భాగంగా నాయ‌కులంద‌రి అభిప్రాయాలు తీసుకుంటోంది. తెలంగాణ నేత‌ల ముందే జాబితాను ఉంచి చ‌ర్చ‌కు పెట్టింది. ఎన్ని విభేదాలున్నా ఇక్క‌డే ప‌రిష్కారం కావాలి, బ‌య‌ట‌కు అంతా ఒకేమాట మీద నిల‌బ‌డాల‌ని అధిష్ఠానం స్ప‌ష్టం చేసింద‌ని స‌మాచారం. అందుకు అనుగుణంగానే తెలంగాణ నేత‌ల‌తో స్క్రీనింగ్ క‌మిటీ వ‌రుస స‌మావేశాలు చేప‌ట్టింది. ఈ స‌మ‌యంలో ఈసీకి తెలంగాణ నేత‌లంతా మూకుమ్మ‌డిగా లెట‌ర్ ఇచ్చారు. రైతు బంధుతో స‌హా ఇత‌ర న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌న్నీ న‌వంబ‌ర్ 2వ తేదీలోగా అమ‌ల‌య్యేలా సీఎస్‌ను ఆదేశించాల‌ని కోరారు.

ఏఐసీసీ యూట్యూబ్ చాన‌ల్‌లో ప్రెస్‌మీట్ ప్ర‌సారం

అధిష్ఠానం ఆదేశం మేరకే రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీలు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, మాజీ ఎంపీ బ‌ల‌రామ్ నాయ‌క్‌ ఉమ్మ‌డిగా ఏఐసీసీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించార‌ని స‌మాచారం. స‌హ‌జంగా ఏఐసీసీ కార్యాల‌యంలో ఏద‌న్నా రాష్ట్ర నాయ‌కులు ఉమ్మ‌డి మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం అరుదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర నేత‌లుఏఐసీసీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం, దానిని ఏఐసీసీ యూట్యూబ్‌చాన‌ల్‌లో ప్ర‌సారంచేయ‌డం అంటేనే తెలంగాణ‌కు అధిష్ఠానం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు అర్థం చేసుకోవాల‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో నాయ‌క‌త్వం ఐక్యంగా ఉన్న‌ద‌నే సంకేతాలు కూడా దీని ద్వారా ఇవ్వాల‌ని పార్టీ అధిష్ఠానం భావించి ఉంటుంద‌ని చెబుతున్నారు.