Nagarjuna Sagar | సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి.. నీటి విడుదల నిలిపివేత

నాగార్జున సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి పడింది. అనుముల(హాలియా) మండలం మారేపల్లి వద్ద గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు.

Nagarjuna Sagar | సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి.. నీటి విడుదల నిలిపివేత

విధాత, హైదరాబాద్ : నాగార్జున సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి పడింది. అనుముల(హాలియా) మండలం మారేపల్లి వద్ద గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈనెల 2న జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఈ కాలువకు నీటి విడుదల చేశారు. ఇంతలోనే గండి పడటంతో కాలువ నిర్వాహణ తీరు పట్ల అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు మరమ్మతులు లేకపోవడంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకే కాలువకు గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ కాలువ ద్వారా 200 చెరువులకు నీరు చేరనుండగా, సుమారు 250 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ వరద కాలువకు 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. కాలువలో బండరాళ్లు, కంపచెట్లు తొలగించకపోవడం వలన గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు. కాగా ఏఎమ్మార్పీ డీఈ గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టి నీటి విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.