కదలనున్న కాళేశ్వరం అవినీతి డొంక?
బీఆరెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చెప్పుకొన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.. నిర్మాణం, అప్పులు ఆది నుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. దీనికితోడు వరదలకు

- ఫోకస్ పెడున్నే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- మేడిగడ్డ బరాజ్‌ను మళ్లీ పరిశీలిస్తాం
- రాష్ట్రానికి డ్యాం సేఫ్టీ ఆథార్టీ లేఖ
- జాతీయ సంస్థలతో దర్యాప్తు జరిపిస్తాం
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
- మరోసారి బరాజ్ సందర్శనకు మంత్రి
- బీఆరెస్ నాయకుల్లో రేగిన గుబులు
- ఇరిగేషన్ అధికారులు ఉక్కిరిబిక్కిరి!
విధాత: బీఆరెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చెప్పుకొన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.. నిర్మాణం, అప్పులు ఆది నుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. దీనికితోడు వరదలకు పంప్‌హౌస్ మునక.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగడం.. అన్నారం, సుందిల్ల బరాజ్‌లు లీక్ అవుతుండటం ఈ ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను, మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, అవినీతి, అప్పులు ప్రధాన ప్రచార అంశంగా చేసుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గత బీఆరెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేసిన అవినీతి, నాసిరకం పనులపై విచారణకు దూకుడుగా ముందుకెళుతున్నది.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను స్వయంగా ప్రాజెక్టు పనుల పరిశీలన చేస్తానని చెప్పడంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామని ప్రకటించి బీఆరెస్ నేతల్లో గుబులు రేపారు. అటు కాళేశ్వరాన్ని మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మలుచుకుందని విమర్శించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ.. మేడిగడ్డ బరాజ్‌ను మళ్లీ పరిశీలించాల్సివుందని, మొత్తం నీళ్లన్నీ ఖాళీ చేశాక తమకు పరిశీలన నివేదిక అందించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ పరిణామం బీఆరెస్ నాయకులకు ఆందోళన కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బరాజ్‌లను మళ్లీ పరిశీలిస్తాం : నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ
మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగిపోయిన ప్రాంతాన్ని వేరు చేసి, నీటిని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత వైఫల్యానికి గల కారణాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు తమకు సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి, రాష్ట్ర నీటి పారుదల కార్యదర్శికి లేఖ రాసింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని జాతీయ అధార్టీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి, వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందితే తాము మరోసారి బరాజ్ పరిశీలన చేయాల్సివుందని ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ నేరుగా తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖలో పేర్కొన్నది. గత నవంబర్ 24న రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శికి సైతం లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఈ దఫా రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి లేఖ రాసింది.
జాతీయ సంస్థలతో దర్యాప్తు జరిపిస్తాం : మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై జాతీయ సంస్థలతో దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో బీఆరెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షణ లోపించిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా లక్షన్నర ఎకరాలలో మాత్రమే ఆయకట్టు సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు గత ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పనుల తుది దశలో ఉన్నసాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రిగా తన శాఖలో అవినీతి లేని పాలన కృషి చేస్తానని చెప్పారు.
ఉత్తమ్ ప్రకటనతో ప్రాజెక్టు వద్ద అలర్ట్
త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తానన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటనతో ప్రాజెక్టులో భాగమైన బరాజ్‌లు, పంప్‌హౌజ్‌ల వద్ద నీటిపారుద శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగింది. అన్నారం, సుందిల్ల బరాజ్‌ల లీకేజీలు వెలుగుచూశాయి. అంతకుముందు జూలైలో వరదలకు కన్నేపల్లి పంప్ హౌస్ నీట మునిగింది. అన్ని సందర్భాల్లోనూ అప్పటి బీఆరెస్ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న విషయాలను బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముందస్తు అనుమతి ఉన్న వారిని మాత్రమే పనుల వద్దకు వెళ్లనిస్తుండటంతో మీడియాకు సైతం అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో తెలియలేదు. ఇప్పుడు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వస్తాననడంతో గతంలో కుంగిన పిల్లర్ల మరమ్మతులో భాగంగా రింగ్ బండ్ నిర్మిస్తున్నారని సమాచారం.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ మేడిగడ్డలో నీళ్లను పూర్తిగా ఖాళీ చేశాక మరోసారి పరిశీలనకు వస్తామని ప్రకటించిన నేపథ్యంలో పిల్లర్ల వద్ద మరమ్మతులతో అధికారులు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద సైతం ఇతరులను అనుమతించకపోవడంతో కూలిపోయిన ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పనులు, మోటార్ల రిపేర్లు ఎంత వరకు చేశారన్నదానిపై అయోమయం కొనసాగుతున్నది. 17 మోటర్లలో ఎన్ని రిపేర్ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జనవరిలో ఐదు మోటర్లను నడిపించి, గోదావరి నీళ్లను ఎత్తిపోశారు. మిగతా మోటర్ల సంగతేమిటన్నదానిపై సమాచారం లేదు. అక్కడికి వెళ్లి చూడటానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.