పోలింగ్ కు పటిష్ట బందోబస్తు
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో గురువారం జరగనున్న శాసన సభ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు

– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద
కేంద్ర బలగాల మోహరింపు
– రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో గురువారం జరగనున్న శాసన సభ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించి పర్యవేక్షిస్తున్నామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 మంది సివిల్ అధికారులు, సిబ్బంది, 16 కంపెనీల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉన్న 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్మ్ డ్ అధికారులతో పోలింగ్ అధికారులు, పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఏన్టీపీసీ, జ్యోతి నగర్, మంథని నియోజకవర్గం మంథని, పన్నూర్, రామగిరి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం బజార్ ఏరియా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెన్నూర్ (ఎల్లక్క పేట్)లలోని పోలింగ్ పరికరాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి సందర్శించారు. ఏసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలింగ్ బందోబస్తు, భద్రతపై ఆదేశాలు, పలు సూచనలు చేశారు.

భారీగా పోలీసుల మోహరింపు
రామగుండం కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 1291 మంది అధికారులు, సిబ్బంది, 6 కేంద్ర బలగాల కంపెనీలు, 500 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హోం గార్డ్స్, మంచిర్యాల జిల్లాలో 1762 మంది అధికారులు, సిబ్బంది, 10 కేంద్ర బలగాల కంపెనీలు, 650 మంది చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన హోంగార్డ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక పోలీస్ టీమ్ ను పోలింగ్ బందోబస్త్ కు వినియోగించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 24 గంటల మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌస్ లను తనిఖీ చేశారు. స్థానికంగా ఓటు హక్కు లేకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులను అక్కడి నుంచి పంపించారు.
ఆకస్మికంగా వాహన తనిఖీ ల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే ప్రజలను, ప్రలోభాలకు గురిచేసే డబ్బులు, వస్తువులు పంపిణీ చేయకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. మంచిర్యాల జిల్లా పరిధిలో1989 మందిని, పెద్దపల్లి జిల్లాలో 2231 మందిని బైండొవర్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ లోకేషన్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సరిహద్దు రాష్ట్రాల ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు.