బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతి: గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతి: గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి

విధాత, సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఆదివారం సూర్యాపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి వృద్ధులు, మహిళలు, చిన్నారులను ఆత్మీయంగా పలకరించారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం చేపట్టారు.


10, 12 వార్డుల్లో కలియదిరుగుతూ, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. జగదీశ్ రెడ్డిని మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించి, సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదోడి ఇంటికీ చేరిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో.. ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డాక పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తున్నాయన్నారు. మిషన్‌ భగీరథ నీటితో గ్రామాల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు పిల్లలమర్రి శివాలయంలో సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు.