విధాత, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ ‘ తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు సభలో వెల్లడించారు. సామాజిక బాధ్యతగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామని, అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా చట్టం వర్తిస్తుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
కుటుంబ ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావాల్సి రావడం బాధాకరమైనప్పటికి..సమాజ సంక్షేమం కోసం, ముఖ్యంగా వృద్దుల సంరక్షణ కోసం తప్పలేదు అన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు అన్నారు.
మన దేశంలో బాలలు, వృద్ధులు, వికలాంగుల కోసం అనేక చట్టాలు ఉన్నాయని, జువైనల్ చట్టం, విద్యాహక్కు చట్టం, పోక్సో చట్టం ఇలా ఎన్నో చట్టాలు తెచ్చామని, వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది అని, కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు అన్నారు. ఈ రోజుల్లో సమాజం తలదించుకునేలా తల్లిదండ్రుల పట్ల కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు అన్నారు. అందుకే వృద్ద తల్లిదండ్రుల సంరక్షణ లక్ష్యంగా చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. ఏ తల్లి దండ్రులు అనాథలుగా ఉండ కూడదు, చివరి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం అని రేవంత్ రెడ్డి వివరించారు.
