త్వరలోనే.. తెలంగాణ కేబినెట్ లో భారీ మార్పులు !

తెలంగాణ కేబినెట్ లో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు జరుగవచ్చన్న ప్రచారం ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా 18మందికి అవకాశం ఉండగా... వాటిలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే రెండు ఖాళీ మంత్రి పదవుల కోసం కేబినెట్ విస్తరణ కాకుండా..ఏకంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం వద్ద చర్చలు పూర్తి చేశారని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తుంది.

త్వరలోనే.. తెలంగాణ కేబినెట్ లో  భారీ మార్పులు !

(వై.వెంకటనరసింహారెడ్డి)

తెలంగాణ కేబినెట్ లో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు జరుగవచ్చన్న ప్రచారం ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా 18మందికి అవకాశం ఉండగా… వాటిలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికి పూర్తి స్థాయిలో కేబినెట్ నియామకం జరుగకపోవడం గమనార్హం. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి, మరో 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2025 జూన్‌లో వాకిటి శ్రీహరి (బీసీ ముదిరాజ్‌), గడ్డం వివేక్‌ (ఎస్సీ మాల), అడ్లూరి లక్ష్మణ్‌ (ఎస్సీ మాదిగ)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంలో మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే రెండు ఖాళీ మంత్రి పదవుల కోసం కేబినెట్ విస్తరణ కాకుండా..ఏకంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం వద్ద చర్చలు పూర్తి చేశారని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తుంది.

కేబినెట్ లోకి ఐదు కొత్త ముఖాలు

తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రులలో పనితీరు సక్రమంగా లేనటువంటి ముగ్గురు మంత్రులను తొలగించేందుకు సీఎం సహా పార్టీ హైకమాండ్ సిద్దమైనట్లుగా ప్రచారం వినిపిస్తుంది. అయితే తొలగించే మంత్రులు ఎవరు.. ఏ మంత్రుల శాఖలను మార్చుతారు..కొత్తగా కేబినెట్ లోకి తీసుకోబోతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ముగ్గురిని తొలగించి.. ఖాళీగా ఉన్న రెండు స్థానాలతో పాటు మొత్తం కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేబినెట్ లోకి కొత్తగా ఐదుగురు మంత్రులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మంత్రివర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేనటువంటి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పునర్ వ్యవస్థీకరణలో అవకాశం కల్పించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే సీఎం వద్ద ఉన్న హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖలు ఎవరికి దక్కనున్నాయన్న అంశం చర్చనీయాంశమైంది.

ఇన్ ..అవుట్ ఎవరో…?

ప్రస్తుత కేబినెట్ లో సీఎం సహా 16మంది మంత్రులు ఉండగా..వారిలో 15మంది మంత్రులకు సంబంధించిన పనితీరుపై ఫోగ్రెస్ రిపోర్టును ఇప్పటికే సీఎం రేవంత రెడ్డి హైకమాండ్ అందించారని తెలుస్తుంది. పనితీరు సక్రమంగా లేని ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నట్లుగా వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని  తొలగించి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తేనే… జిల్లాల వారిగా, సామాజిక సమీకరణల వారిగా..పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీల మేరకు మంత్రిపదవుల పంపకం సాధ్యమవుతుందని ఇటు సీఎం, అటు పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. మునుముందు జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల ఎన్నికలు ఉండటంతో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించడం ఖాయంగా  కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల నుంచి మల్ రెడ్డి రంగారెడ్డికి,  ప్రేమ్ సాగర్ రావు లేదా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. ప్రేమసాగర్ రావు తనకు కార్పోరేషన్ పదవి వద్దని,  మంత్రి పదవే కావాలని మరోసారి బాహటంగానే చెబుతున్నారు.  ఇకపోతే హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లో తీసుకోవచ్చని తెలుస్తుంది.

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఆశావహుల ఎదురుచూపులు

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే తొలగించబడే ముగ్గురు మంత్రుల పదవులతో పాటు  రెండు ఖాళీలతో కలిపి ఐదుగురు కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది. ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిలు రేసులో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి, ప్రేమ్ సాగర్, మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఎస్టీ కోటాలో లంబాడీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎన్. బాలునాయక్, రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు రేసులో ఉన్నారు. వారితో పాటు చివరి నిమిషంలో మరికొందరి కొత్త వారి పేర్లు సైతం తెరపైకి రావచ్చంటున్నారు. మంత్రి పదవుల సర్థుబాటుతో అసంతృప్తి తలెత్తకుండా ఆశావహుల్లోని పలువురిని ప్రభుత్వ చీప్ విప్ లు, డిప్యూటీ స్పీకర్, కార్పోరేషన్ పదవులలో సర్దడంతో పాటు వారికి కేబినెట్ ర్యాంకు ఇచ్చి సంతృప్తి పరుచాలని సీఎం రేవంత్ సహా, పార్టీ హైకమాండ్ లు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తధ్యమన్న ప్రచారం నేపథ్యంలో ఎవరి మంత్రి పదవులు పోతాయి…కొత్తగా ఎవరు మంత్రులు అవుతారు…ఉన్న మంత్రుల్లో ఎవరి శాఖలలో మార్పులు చేర్పులు జరుగనున్నాయని.. ఎవరికి ఏ శాఖలు దక్కుతాయన్న చర్చ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Ramayana | ఓటీటీ మార్కెట్‌లో రామాయ‌ణ హ‌వా.. వార‌ణాసిని మించి మరీ.. ?
Maharashtra | బావిలో ప‌డ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి