యూరియా కొరతకు కారణాలేంటి? ..కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

యూరియా కొరతకు కారణాలేంటి? మూడు లక్షల టన్నులు అవసరం కేటాయింపు 9.80 లక్షల టన్నులు సరఫరా.. 5.32 లక్షల టన్నులే! 3 లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేయండి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల డిమాండ్‌ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కేంద్ర మంత్రి నడ్డాకు వినతిపత్రం

యూరియా కొరతకు కారణాలేంటి? ..కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన
  • యూరియా కొరతకు కారణాలేంటి?
  • మూడు లక్షల టన్నులు అవసరం కేటాయింపు 9.80 లక్షల టన్నులు
  • సరఫరా.. 5.32 లక్షల టన్నులే!
  • 3 లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేయండి
  • కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల డిమాండ్‌ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన
  • కేంద్ర మంత్రి నడ్డాకు వినతిపత్రం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 18 (విధాత): తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం చేతులేత్తిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం వాదిస్తున్నది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది. రాష్ట్రానికి అత్యవసరంగా 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయనేది ప్రభుత్వం భావిస్తోంది.

వర్షాకాల సీజన్‌కు 9.80 లక్షల టన్నుల కేటాయింపు
వర్షాకాల సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేయాలి. కానీ, తెలంగాణకు ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అంటే ఇంకా 2.69 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉంది. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా ప్రవేశించాయి. అయితే సీజన్ ఆరంభంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత జాడలేదు. ఈ ఏడాది జూలై 17 తర్వాత తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో మెట్ట ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. డిమాండ్, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఉంది. దీంతో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

విదేశీ యూరియా సరఫరా విషయంలో ఇబ్బందులు
తెలంగాణకు సరఫరా అయిన 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 3.27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇండియాలో తయారైంది. మిగిలిన 2.05 లక్షల టన్నుల యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. జూలై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇందులో 63 వేల లక్షల మెట్రిక్ టన్నులు దేశీయ యూరియా. మిగిలినది విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నదే. విదేశాల నుంచి యూరియా దిగుమతికి అవసరమైన నౌకలను కేంద్రం కేటాయించాలి. ఇందులో ఆలస్యం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా సరఫరాలో లోటుంది. ఈ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం అలాట్ చేసింది. ఇందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయ యూరియా, 0.39 లక్షల మెట్రిక్ టన్నులు విదేశీ యూరియా. రాష్ట్రానికి దేశీయ యూరియా సరఫరాకు సంబంధించి పీపీఎల్, ఎంసీఎఫ్ఎల్ సంస్థల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అయితే ఈ సంస్థలు యూరియాను సరఫరా చేయలేమని సమాచారం పంపిన విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి తెలిపారు. జూలై వరకు రాష్ట్రానికి కేటాయించిన కోటాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందలేదు. రాష్ట్రానికి ఆగస్టులో కేటాయించిన 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అంటే కనీసంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే రాష్ట్రానికి అవసరం. ఈ యూరియా వెంటనే అందించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

రామగుండం ఫ్యాక్టరీ నుంచి కోటా తగ్గింపు?
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉంది. మూడేళ్లుగా ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ ఫ్యాక్టరీలో తయారైన యూరియాను కేటాయిస్తారు. 2024లో 11.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయింది. ఇందులో 4.68 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి కేటాయించారు. మిగిలినది ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారు. గత ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య 1. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు.ఈ ఏడాది 71,773 మెట్రిక్ టన్నులకే పరిమితమైంది. గత ఏడాది జూలైలో 60 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తే ఈ ఏడాది 30 వేల టన్నులకే పరిమితం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఆగస్టు వరకు 145 రోజుల్లో 78 రోజుల్లో యూరియా ఉత్పత్తి జరగలేదు. ఇది కూడా యూరియా కొరత ఏర్పడడానికి కారణమనే అభిప్రాయాలున్నాయి.

జేపీనడ్డాతో కాంగ్రెస్ ఎంపీల భేటీ
రాష్ట్రానికి అవసరమైన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీనడ్డాను కాంగ్రెస్ ఎంపీలు సోమవారం కోరారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని చెప్పారు. యూరియాను కోటా మేరకు విడుదల చేయాలని ఈ ఏడాది జూలైలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా నిల్వలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. జేపీ నడ్డాను కలిసి యూరియా కోటాను విడుదల చేయాలని కోరాలని సూచించారు. డిమాండ్ కు, సరఫరాకు మధ్య చాలా తేడా ఉన్న కారణంగా జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగ్రోస్ సంస్థల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పదేళ్ల తమ పరిపాలనలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి నిలుచున్న సందర్భాలు లేవని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ విమర్శిస్తోంది. రాష్ట్రానికి కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేసినట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై చర్చకు సిద్దమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు.