Telangana Endowments GO Leak On WhatsApp | ఎండోమెంట్‌లో లీకువీరులు… జీవోలు జారీకి ముందే వాట్సాప్‌లో వైరల్

ఎండోమెంట్ శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీకి ముందే వాట్సాప్‌లో లీక్ శాఖలో అంతర్గత విచారణ ప్రారంభం, కట్టుదిట్టమైన చర్యలు అవుతాయి.

Telangana Endowments GO Leak On WhatsApp | ఎండోమెంట్‌లో లీకువీరులు… జీవోలు జారీకి ముందే వాట్సాప్‌లో వైరల్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విధాత): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం జీవోలు వెబ్‌సైట్లలో కూడా కనిపించనంత గోప్యత పాటిస్తే కాంగ్రెస్ హయాంలో మాత్రం విడుదలకు ముందే జీవోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతున్న తీరు సంచలనంగా మారింది. ఇప్పటికే సచివాలయంలో ఏం జరిగా ప్రతిపక్షాలకు ఇట్టే తెలిసిపోతున్న తీరుతో ఆందోళనలో ఉన్న ప్రభుత్వానికి శాఖలవారీగా తీసుకున్న నిర్ణయాల లీకేజీలు మరింత కలవరపెడుతున్నాయి. తాజాగా ఎండోమెంట్ శాఖలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రెండు సందర్భాల్లో జీవోలు లీకులు కావడంతో శాఖా మంత్రి కొండా సురేఖతో పాటు శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అప్రమత్తమయ్యారు.  ఈ లీకేజీలు ఎక్కడి నుంచి జరిగాయన్న దానిపై అంతర్గతంగా విచారిస్తున్నారు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన విషయాలు ఏ స్థాయి సిబ్బంది నుంచి వాట్సాప్‌లోకి వెళ్లాయన్న విషయాన్ని తెలసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. వీలైతే లీకులకు కారకులైనవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.