- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికకు ప్రాధాన్యం
- ప్రజాప్రతినిధులు, లబ్దిదారుల భాగస్వామ్యం
- స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు
- జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Prajapalana Program | ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను పారదర్శక పాలన ప్రతిబింబించేలా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలకు సానుకూల స్పందన నెలకొన్న నేపథ్యంలో గ్రామసభలను ప్రతిష్ఠాత్మకంగా, ప్రజా ప్రభుత్వానికి ప్రతీకగానే కాకుండా స్థానికులకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులను సభావేదికపై ప్రకటించడమే కాకుండా వారి అభిప్రాయాలను సభల్లో చెప్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సభల్లో ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల ప్రదర్శన, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి వంటి పథకాలపై గ్రామ సభల్లో విస్తృతంగా చర్చించాలన్నారు. వంటి పథకాల లబ్ధిదారుల అనుభవాలు ఈ సభల్లో పంచుకునేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా అమలు చేయనున్న నూతన పథకాలను ఈ సందర్భంగా ప్రచారం చేయాలని సూచించారు. జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో పాటు పాలు, రాగి జావ అందించే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజల నుండి వచ్చే అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
గ్రామాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ గ్రామ సభలను వేదికగా వినియోగించుకోవాలని ఆదేశించారు. వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. సభల్లో అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్థులందరూ హాజరయ్యేలా చూడాలని చెప్పారు.
సభల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వేదిక, త్రాగునీరు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సభల అజెండాను స్పష్టంగా ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ సభలను జయప్రదం చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలతో పాటు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2వ తేదీన జరిగే గ్రామ సభలను జయప్రదం చేసే పనిలో కలెక్టర్లు నిమగ్నమయ్యారు.
ఇవి కూడా చదవండి..
Antibacterial Products | మీరు యాంటిబాక్టీరియల్ సబ్బులు, వైప్స్ వాడుతుంటారా? అయితే.. ఈ వార్త మీకోసమే
Bengaluru Techie Couple Suicide : బెంగళూర్ లో టెకీ జంట ఆత్మహత్య
Vermicompost Business | వర్మీకంపోస్టు తయారీ.. రూ. 20 వేల పెట్టుబడితో ఏడాదికి రూ. 2 కోట్ల టర్నోవర్
