ఆధార్, ఓటరు కార్డుతో ప్రజా పాలన దరఖాస్తులకు లింకు

‘ప్రజాపాలన కార్యక్రమంలో కోటీ 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 25-30 వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఆధార్, ఓటరు కార్డుతో ప్రజా పాలన దరఖాస్తులకు లింకు

– ఈనెల 30లోగా డేటా ఎంట్రీ పూర్తీకి చర్యలు

– పూర్తి డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తాం

– కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షణ

– అర్హులైన ఎవరినీ మిస్ కానివ్వం

– మంత్రుల సమావేశంలో సీఎం నిర్ణయం

– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

విధాత: ‘ప్రజాపాలన కార్యక్రమంలో కోటీ 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 25-30 వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కుటుంబంలోని ఇతర కార్డులకి లింకప్ చేస్తామని, దీంతో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో డేటా ఎంట్రీ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు. ప్రజాపాలన దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత తదితర అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు. 6 గ్యారంటీల పథకాలకు అర్హులైన ఎవరినీ కూడా మిస్ కానివ్వమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామనీ తెలిపారు. ఆతర్వాత పథకాల అమలుపై క్యాబినెట్ లో చర్చించి, ఇచ్చిన మాటకి కచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. పథకాల అమల్లో బీఆరెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు కూడా జరుగుతాయన్నట్టు ప్రతిపక్షం వ్యవహరిస్తోందని విమర్శించారు.

20 లక్షల దరఖాస్తులు అదనం

ఇందిరమ్మ రాజ్యంలో గత ఏడాది డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి జిల్లా అధికారి వరకు 8 రోజుల పాటు ప్రతి గ్రామానికి, వార్డుకు, గూడేనికి, చెంచుల వద్దకు వెళ్లామన్నారు. వారికి ఎం అవసరమని దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, ఈక్రమంలో కోటీ 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన అప్లికేషన్ లో లేనివి 20 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం కోటీ 25 లక్షల దరఖాస్తులు రాగా, తక్కువ సమయంలో దేశంలో ఇన్ని దరఖాస్తులు ఎక్కడా తీసుకోలేదని చెప్పారు. దరఖాస్తుల ప్రక్రియ విజయవతంగా జరిగిందని, అభయహస్తం దరఖాస్తులతో 6 గ్యారంటీ లు పూర్తయ్యాయని మేం అనుకోవడం లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని, మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.