Konda Surekha | రాష్ట్రపతిని అవమానించిన మోదీ.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Konda Surekha | రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో మహిళ ఉన్నందునే ద్రౌపతి ముర్మును అవమానపరిచే విధంగా మోదీ ప్రవర్తన ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్టీ మహిళ, వితంతు అయినందునే ఈ వివక్ష
పార్లమెంట్ భవన ప్రారంభానికి పిలువలేదు
ఆయోధ్యగుడి ప్రారంభానికి ఆహ్వానం లేదు
ఎస్సీ,ఎస్టీ,బీసీలంటే బీజేపీనేతలకు చిన్నచూపు
ఢిల్లీవేదికగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
Konda Surekha | విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో మహిళ ఉన్నందునే ద్రౌపతి ముర్మును అవమానపరిచే విధంగా మోదీ ప్రవర్తన ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముర్ము ఎస్టీ మహిళ కావడమే కాకుండా, వితంతు అనే దృష్టితోనే పార్లమెంట్ నూతన భవన ప్రారంభానికి, అయోధ్యలో రామాలయం ప్రారంభానికి పిలువకుండా వివక్ష చూపారని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిర్వహించిన ధర్నాలో కొండా సురేఖ ప్రసంగించారు. కులం, మహిళ కారణంగా రాష్ట్రపతినే చిన్నచూపు చూసిన బీజేపి నాయకులకు బీసీలను పట్టించుకోకపోవడంలో వింతేమీలేదని కొండా సురేఖ మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే బీజేపీకి చిన్నచూపు
బీజేపీ బీసీలపట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బిల్లుకు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారన్నారు. బిల్లుపై కేంద్రం నుంచి మూడు నెలలుగా స్పందన లేదని, పైగా మోదీ బీసీ అని చెప్పుకుంటాడని అన్నారు. బీసీ బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ ఎందుకు బిల్లు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ముస్లింలను తీసివేస్తే బిల్లు మద్ధతు ఇస్తామంటూ కొత్త రాగం ఎత్తుకోవడం దారుణమన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా? అంటూ ప్రశ్నించారు.
కవిత ధర్నా జోక్
కల్వకుంట్ల కవిత ధర్నా చేయడం పెద్ద జోకుగా సురేఖ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. బతుకమ్మ, జాగృతి అంటూ ఇప్పుడు బీసీ ఉద్యమం అంటుందని విమర్శించారు. కులగణన సర్వే జరుగుతున్నప్పుడు కేటీఆర్, హరీశ్ రావు విషం చిమ్మారని, బీసీలకు న్యాయం జరగడం వాళ్ళకు ఇష్టం లేదని సురేఖ ఆరోపించారు.
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
బడుగు, బలహీనవర్గాలకు ఆది నుంచి అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. మంత్రి స్థాయికి వచ్చానంటే సోషల్ జస్టిస్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధే కారణమన్నారు. ఎందరో బీసీ నేతలను సీఎంలుగా, పీసీసీ అధ్యక్షులుగా చేశారన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి వల్ల కాంగ్రెస్ పట్టుదలతో పనిచేస్తుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
రాష్ట్రపతి వితంతువు అని పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆమెను పిలవలేదు… అయోధ్యకు కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఒక SC కాబట్టి – మంత్రి #KondaSurekha pic.twitter.com/9Pn4qTnk5V
— greatandhra (@greatandhranews) August 6, 2025