Telangana MLA’s Disqualification Schedule Released | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 29 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎదుట వాదనలు ప్రారంభం.

విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ ను తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ జారీ చేశారు. సెప్టెంబర్ 29(సోమవారం) ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభం కానున్నాయి. 29తేదీన విచారణకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి. ప్రకాశ్ గౌడ్, చింత ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య,
చింత ప్రభాకర్ వర్సెస్ గుడెం మహిపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరుకావాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1 (బుధవారం) మరోసారి అదే కేసులపై వారు మరోసారి విచారణకు హాజరుకానున్నారు. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు..ప్రత్యక్ష వాదనలు వినిపించనున్నారు. అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వివాదంలో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అనర్హతపై స్పీకర్ కు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ బీ.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం జూలై 31న ఈ తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.