ముగిసిన నామినేషన్లు.. 13న పరిశీలన..15న ఉపసంహరణ

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజున భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోగా, అప్పటికే టోకెన్లు పొందిన లైన్‌లో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు మాత్రం స్వీకరించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,634కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున 1133మంది 1369నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 13న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నెల 30న 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. చివరి రోజున కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈదఫా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆరెస్ పార్టీ మొత్తం 119స్థానాల్లో పోటీ చేస్తు అభ్యర్ధులందరికి బీఫామ్‌లు కూడా జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 118స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆ పార్టీ మిత్ర పక్షంగా సీపీఐ కొత్తగూడెం సీటులో పోటీ చేస్తుంది. బీజేపీ 111స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్ర పక్షం జనసేన 8చోట్ల పోటీ చేస్తుంది. బీఎస్పీ 119స్థానాల్లో పోటీ చేస్తుంది. మజ్లీస్ 9 స్థానాల్లో, సీపీఎం 18స్థానాల్లో, పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల నుంచి టీడీపీ, వైఎస్సాఆర్‌టీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. వైఎస్సాఆర్‌టీపీ మాత్రం అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడం, పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఇక పార్టీల ప్రచారం మరింత ఉదృతం కానుంది.