మొత్తం 4200 మంది ఫోన్ల ట్యాపింగ్.. బయటకు వస్తున్న సంచలనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకుసాగుతున్న కొద్దీ కొత్తగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు బృందం ఏకంగా 4,200మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించిందని సమాచారం

- మొత్తం 4200 మంది ఫోన్ల ట్యాపింగ్
- ప్రభాకర్‌రావు టీమ్ దారుణాలు ఎన్నో
- బయటకు వస్తున్న సంచలనాలు
- మరోసారి సిట్ విచారణకు ప్రణీత్ రావు
- కొనసాగుతున్న సాక్షుల వాంగ్మూలాలు
విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకుసాగుతున్న కొద్దీ కొత్తగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు బృందం ఏకంగా 4,200మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించిందని సమాచారం. మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో ఎంపిక చేసుకున్న రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు, జడ్జీలు, సెలబ్రిటీలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఆధారాలు ఇచ్చారని తెలిసింది. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్యలో కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీకి చెందిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేశ్, వైఎస్ షర్మిల సహా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటంరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం.
మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులలో ఒకరైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు బుధవారం మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ల్యాప్ టాప్, డాక్యుమెంట్లతో ప్రణీత్ రావు విచారణకు హాజరవ్వడం ఆసక్తి రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్‌బీఐలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ బాధ్యతలను ప్రణీత్ రావు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేశారని అభియోగాలు ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో కలిపి గురువారం ప్రణీత్ రావును విచారించనున్నారు. మరోవైపు బుధవారం సిట్ అధికారులు బుధవారం పదుల సంఖ్యలో సాక్షుల స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. సిట్ ముందు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గుండ్లవల్లి సైదులు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సిట్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు.