Telangana | 14.6 లక్షల కోట్లకు పెరిగిన జీఎస్డీపీ … దేశంలో మూడో స్థానంలో తెలంగాణ
రాష్ట్ర శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2024)ను విడుదల చేశారు

జాతీయ స్థాయి కంటే 2.8శాతం అధికం
16 జిల్లాల్లో జాతీయ సగటు కన్నా 14.2% శాతం అధికం
2014 – 15లో తలసరి ఆదాయం రూ.1,24,104
2023 – 24 సంవత్సరానికి రూ.3,47,299కు
తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడి
విధాత, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2023)ను విడుదల చేశారు. ఈ ఔట్ లుక్ లో వివిధ రంగాల్లో తాజా పరిస్థితులను వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 2022 – 23లో 13.1 లక్షల కోట్లు కాగా 2023 – 24 లో 14.6 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 11.9 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో పెరుగుదలను (9.1శాతం) పరిగణనలోకి తీసుకుంటే 2.8శాతం అధికంగా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 14.2 శాతం, ఉత్తర ప్రదేశ్ 12.8 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. 2023-24లో స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని నివేదిక తెలిపింది.
ప్రథమ స్థానంలో సేవల రంగమే
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో సేవల రంగం ప్రథమ స్థానంలో దూసుకుపోతున్నదని నివేదిక తెలిపింది. ప్రతి ఏడాది మాదిరి తాజా సంవత్సరంలో కూడా సేవల రంగం నుంచే ఆదాయం గణనీయంగా వస్తోంది. ఈ రంగం పరిధిలో ఆసుపత్రులు, రవాణ, స్థిరాస్తి, రెస్టారెంట్లు, హోటళ్లు తదితర సేవలు వస్తాయి. 2023 – 24 లో సేవల రంగం విలువ గత ఏడాదితో సరిచూస్తే 65.7 శాతం పెరగడం గమనార్హం. గనులు, క్వారీల నుంచి 18.5 శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి 15.8 శాతం, పరిశ్రమల రంగం 19.8 శాతం ఆదాయం రానున్నది. అయితే 2021 – 22లో వ్యవసాయ రంగం నుంచి 18 శాతం ఆదాయం ఉండగా, అది 2022 – 23కు 17 శాతానికి, 2023-24 కు అది 15.8 శాతానికి పడిపోనున్నట్లు అంచనా వేశారు. పరిశ్రమల రంగం నుంచి కూడా 2021 – 22లో 19.8 శాతం ఉండగా 2022 – 23 నాటికి 18.8 శాతం ఉండగా అది 2023 – 24 నాటికి 18.5 శాతానికి తగ్గనున్నది. హోటళ్లు, రవాణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సేవల ద్వారా 65.7 శాతం ఆదాయం రానున్నది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 1.5 శాతం ఎక్కువగా ఉండటం సంతృప్తినిచ్చే అంశమని పేర్కొన్నది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు ఉండగా 16 జిల్లాల్లో జిడిడిపి జాతీయ సగటు కన్నా 14.2 శాతం అధికంగా ఉందని తెలిపింది.
పెరిగిన తలసరి ఆదాయం
2014 – 15 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా 2023-24 సంవత్సరానికి రూ.3,47,299కు పెరిగింది. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణలో రూ.1.64 లక్షలు అధికం. 2022-23లో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9,46,862 కాగా హైదరాబాద్ రూ.4,94,033. దేశంలో తలసరి ఆదాయం 2022 – 23లో రూ.1,69,496. ములుగు జిల్లాలో తలసరి ఆదాయం అతి స్వల్పంగా రూ.6,914గా ఉంది.
తెలంగాణలో మహిళా కార్మికులు అధికం
తెలంగాణలోని మొత్తం కార్మికులలో 15-59 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు 63.4 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో 59.5 శాతంగా నమోదు అయ్యింది. జాతీయ స్థాయిలో పురుష కార్మికుల శాతం 80.2 శాతం కాగా, తెలంగాణలో 77.7 శాతంగా ఉంది. తెలంగాణ మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. నిరుద్యోగుల శాతం పరిశీలిస్తే తెలంగాణలో 2021-22లో 4.5 శాతం ఉండగా 2022-23లో 4.6 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం. వ్యవసాయ రంగంలో అత్యధికంగా 47.3 శాతం ఉపాధి లభిస్తుండగా, సేవల రంగంలో 33 శాతం మందికి, పారిశ్రామిక రంగంలో 19.7 శాతం మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యవసాయేతర రంగంలో రెగ్యులర్, నెలవారీ జీతాలు తీసుకునే వారి సంఖ్య గతేడాది లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే పెరుగుదల బాగానే ఉంది.