Telangana Techie Shot dead | అమెరికాలో తెలంగాణ టెకీని కాల్చిచంపిన పోలీసులు
మహబూబ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ మొహమ్మద్ నిజాముద్దీన్ అమెరికా సాంటా క్లారాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మరణానికి ముందు సోషల్ మీడియాలో జాతి వివక్ష, వేధింపులు ఎదుర్కొన్నానని పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

- కాలిఫోర్నియా సాంటా క్లారాలో ఘటన
- రూమ్‌మేట్‌తో ఘర్షణ, పోలీసులు జోక్యం
- జాతివివక్ష, వేధింపులకు గురైనట్లు మృతుడి పోస్ట్
- భారతీయ ఉద్యోగుల్లో భయందోళనలు
Telangana Techie Shot dead | మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ (30) అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని సాంటా క్లారాలో సెప్టెంబర్ 3న ఈ ఘటన జరిగింది. అతని రూమ్‌మేట్‌తో గొడవ తలెత్తి, ఇరువురి ఘర్షణ కత్తిపోట్ల దాకా వెళ్లిందని పొరుగువారు 911కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి నిజాముద్దీన్ తన రూమ్‌మేట్‌ను కింద పడేసి కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసుల వాదన. అప్పటికే రూమ్‌మేట్‌ను కత్తితో గాయపర్చినట్లుగా, పలుమార్లు లొంగిపోవాలని చెప్పినా వినకపోగా, మరోసారి అతన్ని పొడవబోతున్నట్లుగా కనబడటంతో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన నిజాముద్దీన్‌ను ఆసుపత్రికి తరలించగా, కాసేపటికే అతను మరణించాడు.
జాతివివక్ష, శ్వేతజాతి వేధింపులే కారణం : సోషల్ మీడియాలో నిజాముద్దీన్ ఆవేదన
కాగా, నిజాముద్దీన్ కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయంలో టెక్నికల్ లీడ్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే నిజాముద్దీన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో జాతి వివక్ష, వేధింపులకు, జీతం విషయంలో, ఉద్యోగం విషయంలో మోసానికి గురైనట్లు, అన్యాయంగా తనను జాబ్నుండి తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేసాడు. ఆఖరికి తన ఆహారంలో విషం కలిపినట్లు ఆరోపించిన నిజాముద్దీన్, అమెరికన్ శ్వేతజాతి అహంకారానికి వ్యతిరేకంగా గళం విప్పుతానని రాసాడు. తన కంపెనీ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని, అయినా కూడా వేధింపులు ఆగలేదని వాపోయాడు.
ఈ పోస్టులు అతని మానసిక స్థితి, అతను ఎదుర్కొన్న సమస్యలను బహిర్గతం చేస్తున్నాయి. అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే వలస టెకీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది.
నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ మాట్లాడుతూ, తన కుమారుడి మరణ వార్త రెండు వారాల తర్వాతే తెలిసిందని, . పోలీసులు ఎందుకు త్వరపడి కాల్పులు జరపాల్సివచ్చిందని, విచారణ ఎందుకు జరపలేదంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అతని మృతదేహాన్ని రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలంటూ అభ్యర్థించాడు.
ఇదిలా ఉంటే, అమెరికా సాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును పారదర్శకంగా దర్తాప్తు చేస్తున్నట్లు తెలిపింది. భారత రాయబార కార్యాలయం కూడా స్పందించి కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. మహబూబ్‌నగర్ రాజకీయ వర్గాలు, మజ్లిస్ బచావో తహ్రీక్ నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాసి, వెంటనే జోక్యం చేసుకుని మృతదేహాన్ని భారత్‌కు రప్పించమని కోరారు.
కానీ, కాలిఫోర్నియాలోని అమెరికన్ భారతీయులు ఈ దురాగతంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అమెరికాలోని పోలీస్ వైఖరిపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. నిజాముద్దీన్ నిజంగా రూమ్‌మేట్‌పై దాడి చేశాడా? లేక అతనే స్వయంగా పోలీసులకు సహాయం కోసం కాల్ చేశాడా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కుటుంబం మాత్రం ఇది జాతి వివక్ష కారణంగానే జరిగిందని ఆరోపిస్తోంది. మరోవైపు, పోలీసులు తమ విధులు నిర్వర్తించామని అంటున్నారు.
ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడం వల్ల అమెరికాలోని భారతీయ వలసదారుల్లో క్రమంగా భయం పెరుగుతోంది. ముఖ్యంగా టెకీల్లో తమ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజాముద్దీన్ మరణం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, వలసదారుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది.