Telangana Assembly | సభను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్…సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
ప్రభుత్వం తో ప్రతిపక్షం కలిసి వస్తుందని బీఆరెస్ నేత కేటీఆర్ చెప్పడం నమ్మేది కాదని, ముందుగా ప్రతిపక్ష నేత సభకు వచ్చి సహకరించాలని చురకలేశారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు ఒక్క మహిళకు మంత్రి ఇవ్వలేదని, మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదని, ఇప్పుడు వారిపట్ల బీఆరెస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం తో ప్రతిపక్షం కలిసి వస్తుందని బీఆరెస్ నేత కేటీఆర్ చెప్పడం నమ్మేది కాదని, ముందుగా ప్రతిపక్ష నేత సభకు వచ్చి సహకరించాలని చురకలేశారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు ఒక్క మహిళకు మంత్రి ఇవ్వలేదని, మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదని, ఇప్పుడు వారిపట్ల బీఆరెస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని, సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని సీఎం రేవంత్‌రడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు వారికి ఉన్నాయని, మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్లు పాలన చేసినవారు పదినెలలు పూర్తిచేసుకోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందని, నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ధరకు సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి పంపిణీ చేసి కమిషన్ కొట్టేశారని.. పైకి మాత్రం నేత కార్మికులకు పనులు కల్పించామని అబద్ధాలు చెప్పారని అగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆరెస్ ప్రభుత్వం బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చిందన్నారు. కార్మికులకు రూ.275 కోట్ల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లించానని చెప్పారు. . ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని, దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదని, హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదన్నారు. కరీంనగర్ న్యూయార్క్ చేస్తామనలేదన్నారు. ఆజామాబాద్ లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన జరుగనుందని, హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామన్నారు. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏషియన్ గేమ్స్ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడియమ్స్ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయని విమర్శించారు. ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి నెలకొందన్నారు. స్పోర్ట్స్ హబ్ నిర్మాణంతో క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వలేదని, మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. ఫార్మాసిటీ అని వాళ్లన్నారు, మేం ఫార్మా విలేజ్‌లు అంటున్నామని, వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని, కేటీఆర్ 100శాతం ఆర్టిఫీషియల్, సున్నా శాతం ఇంటెలిజెన్స్ అని చురకలేశారు.
ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని, ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని, మన భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతుందని, మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఎన్నికలైపోయాయి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండని, కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చానని, మా మంత్రి వెంకట్‌రెడ్డి అయితే ఉదయమే 9.30కు వచ్చి కూర్చున్నారని, తీరా చూస్తే కేసీఆర్ సభకు రాలేదన్నారు. . ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్ నిర్మించాలనుకుంటున్నామని, ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలపై ప్రతిపక్షం సహేతుకమైన సలహాలిస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్ పాలసీలు తీసుకొస్తామన్నారు. పాలసీలు మార్చింది గత ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ పాలసీ తప్ప ఇంకే పాలసీ లేదన్నారు.