అసెంబ్లీలో కమ్యూనిస్టుల గళం వినిపిస్తా

తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో కమ్యూనిస్టుల గళం వినిపిస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

అసెంబ్లీలో కమ్యూనిస్టుల గళం వినిపిస్తా

– బీఆర్ఏస్ నిధుల కేటాయిపుఫై శ్వేతపత్రం విడుదల చేయాలి

– ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పూర్తి చేయాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో కమ్యూనిస్టుల గళం వినిపిస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు బుధవారం నల్లగొండ సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈసందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడారని, ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకొనే విధంగా సంతోషంతో ఉన్నారన్నారు.


సచివాలయాన్ని కేసీఆర్ ముళ్లకంచెలతో నిర్బంధం చేస్తే, నూతనంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇనుప కంచెలను తొలగించిందన్నారు. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు కనబడని నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లలో నిధులను దారి మళ్లింపు చేసిందని, వెంటనే నిధులు దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


నిధుల కేటాయింపు.. దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ సంస్థలను పూర్తిగా నష్టాల్లోకి నెట్టి వాటిపై వచ్చిన లాభాలను దారి మళ్ళించారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్ బీసీ టన్నెల్ పూర్తి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తన సొంత బిడ్డలా చూసుకున్న కమీషన్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత ఎస్ఎల్ బీసీ టన్నెల్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించలేదని విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ 2005లో వైయస్సార్ హయాంలో శంకుస్థాపన చేసిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ 80 శాతం పూర్తి చేయడానికి గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.


ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్నదని, తక్షణమే ఎస్ ఎల్ బీసీ పూర్తి కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు నిధులు కేటాయించాలని, అందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకరావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జుని యాదగిరిరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొలుగూరి నరసింహ, గురిజ రామచంద్రం, నల్పరాజు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, ఆర్ అంజా చారి, బంటు వెంకటేశ్వర్లు, బీ వెంకటరమణ, గిరి రామ, ప్రజాసంఘాలు నాయకులు పాల్గొన్నారు.