టీపీసీసీ చీఫ్ రేవంత్ అరెస్టు.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డిని మంగళవారం గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

విధాత, హైదరాబాద్: డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంగళవారం గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో రేవంత్ పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి, డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ తో పాటు, పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలను గాంధీభవన్ కు తరలించారు. కాంగ్రెస్ నిరసనతో గన్ పార్క్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.