కేసీఆర్ నా కాలి గోటిని కూడా కొనలేవు: రేవంత్‌రెడ్డి

– సీఎం రేటెంత రెడ్డి అంటున్న.. కచర సీఎం
– కాంగ్రెస్ విజయ భేరి సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
– అధికారంలోకి రాగానే కేసీఆర్ ను బొక్కలో వేస్తాం
– కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచారు
– సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే…
అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆరెస్
– తెలంగాణకు పట్టిన దరిద్రం పోవాలంటే
బీఅర్ఎస్ ను సాగనంపాలి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘కేసీఆర్ అంటేనే కచ్రా.. నీ పేరులోనే ఆ పదం ఇమిడి ఉంది. రేటెంతరెడ్డి అంటూ కోఠిలో రాష్ట్రాన్ని అమ్ముతానంటూ విమర్శించిన కేసీఆర్, నాకాలి గోటిని కూడ కొనలేవు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోవాలంటే బీఅర్ఎస్ ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం మెదక్ రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే, భట్టి విక్రమార్క, మైనంపల్లి హన్మంతరావు, జగ్గారెడ్డి, మెదక్ అభ్యర్థి రోహిత్ రావు, నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజీ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బెల్టుషాపుల రాష్ట్రంగా మార్చాడని, బడికెళ్లే పిల్లలు సైతం బీరుబాటిల్ ఎత్తే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
సోనియాగాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది యువత చనిపోతే, కడుపు శోకం తెలిసిన తల్లి సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యమ ఆకాంక్ష లైన నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేర్చకుండా కేసీఆర్ దోచుకుని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. కాళేశ్వరం పాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ నాణ్యతా లోపంతో నిర్మించటం వల్లే కుంగి పోయి, కేసీఆర్ అవినీతి బట్టబయలైందన్నారు. అసాంఘికశక్తులు బాంబులు పెట్టడంతోనే కుంగి పోయిందని సీఎం అనటం సిగ్గుచేటన్నారు.
బాంబులు పెడితే పేలిపోతుందనే విషయం చిన్న పిల్లలకు కూడ తెలుస్తోందని, 80 వేల పుస్త కాలు చదివిన కేసీఆర్ జ్ఙానం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు పట్టిన దరిద్రం వదలాలంటే బీఆర్‌ఎస్‌ను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడికీ గుర్తింపు ఉంటుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు 6 గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. ప్రతి మహిళకు రూ.2500, రూ.500లకే సిలిండర్, ప్రతి నెలకు రూ.4 వేల పెన్షన్
ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కోసం రూ.5 లక్షలు, కౌలురైతులకు రూ.12 వేలు, రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. పార్టీలో కష్ట పడే వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన విఠల్ రెడ్డి కుటుంబానికి, పీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారన్నారు.
హరీష్ రావు, దేవేందర్ రెడ్డిలను జైలుకు పంపుతాం
– మైనంపల్లి హన్మంతరావు
మంత్రి హరీష్ రావు మెదక్ కు పట్టిన శని అని, అయన్ను, మెదక్ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చేసిన అవినీతిపై విచారించి జైలు పంపుతామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తాను మెదక్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల అభివృద్ది పనులు చేశానని, ఒక్క రూపాయి తగ్గినా నాకుమారుడు రోహిత్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడని తేల్చి చెప్పారు. సీఎం కుటుంబం అల్లుడు, బిడ్డ, కొడుకు అవినీతి డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకొనే స్థితికి ఎదిగారన్నారు. 1997 నుండి మైనంపల్లి సేవాసమితి ద్వారా రూ.100 కోట్లు విలువైన పనులను చేపట్టానని అన్నారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు మాట్లాడుతూ తాను మెదక్ ప్రజలకు సేవచేసేందుకే మెదక్ కు వచ్చానని అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా 30 రోజులు పనిచేయండి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు చేస్తామన్నారు. దుబ్బాక అభ్యర్థి చెఱకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పాపన్నపెట్ ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, బీఅర్ఎస్ నుండి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభలో నాయకులు సుహాసిని రెడ్డి, సుప్రభాత రావు, సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.