యదేచ్ఛగా పుస్తకాలు విక్రయం , పట్టించినా చర్యలు తీసుకోని అధికారులు … బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మండలాల్లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు యథేచ్చగా అధిక ధరలతో పుస్తకాల విక్రయం పేరుతో తల్లిదండ్రులను దోపిడి చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ ఆరోపించారు

విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మండలాల్లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు యథేచ్చగా అధిక ధరలతో పుస్తకాల విక్రయం పేరుతో తల్లిదండ్రులను దోపిడి చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ ఆరోపించారు. వలిగొండలోని ఓ ప్రవేట్ స్కూలుకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తుంటే స్వయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మండల, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫోన్ చేసి చెప్పిన మాకు సంబంధం లేదంటున్నారని తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కైన విద్యాశాఖాధికారుల తీరుతో జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం..కుమ్మక్కు విధానాలతో ప్రైవేటు స్కూళ్లూ ఇష్టానుసారంగా బస్సు ఫీజులు, పుస్తకాలు, డొనేషన్, యూనిఫామ్ ఫీజులంటూ తల్లిదండ్రులను, విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. యాదాద్రి జిల్లా విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాల వ్యవధిలో 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతో మంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉన్నదని ఆరోపించారు. ప్రైవేటు ఫీజుల దోపిడిపి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చేలా విద్యాశాఖాధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి జిల్లా విద్యాశాఖాధికారులను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సల్ల మనీల్, లింగస్వామి, సరిత, మహేందర్, భాస్కర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.