గుడిసెలపై ఆధిపత్య ‘పోరు’

- చేరికలంటున్న తూర్పు ఎమ్మెల్యే నరేందర్
- వామపక్ష పార్టీ నాయకుల అరెస్ట్
- పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, వామపక్షాల ధర్నా
- పోలీసుల తీరుపై కొండా సురేఖ ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల వేళ ఓట్ల రాజకీయంలో వరంగల్ గుడిసెవాసులు పావులుగా మారుతున్నారు. రాజకీయ పార్టీ నేతలు ఆదుకుంటారని, అండగా నిలుస్తారని, పట్టాలిస్తారనే ఆశతో ఉన్న వారిని, తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఇప్పటికే గుడిసెవాసుల కాలనీలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయకులు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉన్న గుడిసెవాసులపై దృష్టి కేంద్రీకరించారు. వీరికి గతంలో సీపీఐ, సీపీఎంలో ఉండి, ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరిన వారు సహకరిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్సెస్ వామపక్షాలు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ఉన్న గుడిసెవాసుల కాలనీలపై తమ పట్టును సాధించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం రాజకీయ విభేదాలకు దారితీస్తోంది. గులాబీ పార్టీ నేతలు సీపీఐ, సీపీఎంకు చెందిన గుడిసెవాసులు తమ పార్టీలో చేరారని ప్రకటిస్తున్నారు. తమవారిని అదిరించి, బెదిరించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి గుడిసెవాసుల కాలనీలపై బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నదని వామపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఉన్నందున తమపై కక్ష సాధింపు చర్యలో భాగంగా సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు నిర్బంధించి భయపెడుతున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్, వామపక్షాల మధ్య గుడిసెవాసుల కాలనీలపై నెలకొన్న ఆధిపత్య పోరులో కాంగ్రెస్ నాయకులు వామ పక్షాలకు అండగా నిలుస్తుండగా, అధికార పార్టీ పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జక్కలొద్దిలో గుడిసెవాసులు
వరంగల్ తూర్పు పరిధిలోని జక్కలొద్దిలోని ప్రభుత్వ భూమిలో రెండేళ్ల క్రితం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. దాదాపు 3,000 మంది రోజువారి కూలీలు, పేదలు ఈ తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సీపీఐ, సీపీఎం పక్షాలు భూ అక్రమణాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ముందుకు వచ్చింది.
ఈ సమయంలో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య కొంత సయోధ్య కుదిరి, మునుగోడులో బీఆర్ఎస్‌కు వామపక్షాలు సంపూర్ణ సహకారాన్ని అందించాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని ప్రచారం అప్పుడు సాగింది. ఈ స్థితిలో ప్రభుత్వం, పోలీసులు భూఆక్రమణలను చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో నగరంలో కొత్తగా పదుల సంఖ్యలో గుడిసెవాసుల కాలనీలు వెలిశాయి. ఇక్కడి మేరకు కథ బాగానే ఉన్నది.
చెదిరిన పొత్తుతో బీఆర్ఎస్ కలవరం
కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్, వామపక్షాల మధ్య విభేదాలు పొడచూపి పొత్తు కొండెక్కిన విషయం తెలిసిందే. దీంతో వామపక్షాలు సహజంగానే బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉన్నాయి. ఇదే క్రమంలో నిన్నటి వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉన్న గుడిసెవాసుల కాలనీలు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారే అవకాశాలు ఉన్నందున, బీఆర్ఎస్ వీటిపై దృష్టి పెట్టింది. వామపక్ష పార్టీలోని కొందరు నాయకులను బెదిరించి, అదిరించి, లోబరుచుకొని జక్కలొద్దిలోని గుడిసెవాసులతో గురువారం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. గుడిసెలపై గులాబీ జెండాలు ఎగరవేశారు. తమ పార్టీలో వామపక్షాల నుంచి 3000 మంది చేరినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. గుడిసె వాసులకు పట్టాలిచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
వామపక్ష, కాంగ్రెస్ నాయకుల ధర్నా
జక్కలొద్దిలో చేరికల కార్యక్రమం సాఫీగా సాగాలంటే సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుగా ఉండకూడదని భావించి, సీపీఎంకు చెందిన సాగర్ తదితరులను పోలీసులు నిర్బంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ విషయం తెలిసి సీపీఐ, సీపీఎం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు మద్దతుగా నిలిచే వామపక్ష పార్టీలపై బీఆర్ఎస్ పోలీసులను ప్రయోగించి బెదిరింపులకు పాల్పడడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ నాయకురాలు, మాజీమంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఏఎస్పీ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి స్థానిక పోలీసులు సహకరించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును విమర్శించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాన్ని ఖండించారు. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ఈ సందర్భంగా కొండా సురేఖ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబు, రత్నమాల పాల్గొన్నారు.