ఢిల్లీకీ, గుజరాత్‌కు గులాంలు కాదు: మంత్రి కేటీఆర్

- పెన్షన్లు త్వరలో పెంచుతాం
- కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో వచ్చే పార్టీలు
- తెలంగాణపై విషం కక్కుతున్న మోడీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ వాళ్లు అంటారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా. మేం ఢిల్లీకీ, గుజరాత్ కు గులాంలం కాదు. మేం ఎవ్వనికి భయపడం, ఎవనికి బీ టీం కాదు. మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏ టీం’ అంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాదిరి ఏ నిర్ణయం తీసుకోవాలన్న మా అధిష్టానం ఢిల్లీలో లేరని, ఇక్కడే మా లీడర్ కేసీఆర్ ఉన్నారంటూ ప్రకటించారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ పెన్షన్ పెంచబోతున్నారని కేటీఆర్ చెప్పారు. వరంగల్ నగర పర్యటన సందర్భంగా శుక్రవారం హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో రూ.900 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడా గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధ్యక్షతన, తదుపరి ఖిలావరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రాన్ని 60 ఏళ్లు ఆగం చేశారు..
తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్ర బిందువు అయ్యిందన్నారు. వరంగల్ ఎప్పుడూ నాయకుడు కేసీఆర్‌కి అండగా నిలిచి ఉద్యమానికి ఊపిరి ఊది, అండగా నిలిచిందన్నారు. తొలినుంచి తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట 360 మంది, తర్వాత 12 వందల మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004 నుంచి 2014 వరకు అన్యాయం చేసి ప్రజాశక్తి ముందు తలొగ్గి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఎప్పుడూ నిజాయితీ లేదని విమర్శించారు.
ఎన్నికలు రాగానే విపక్షాల ప్రవేశం
ఓట్ల కోసం తిమ్మినిబమ్మిని చేస్తూ తప్పుడు ప్రచారం చేసేందుకు గంగిరెద్దులతీరు విపక్షాలు వస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ జపం చేస్తున్నారన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. కేసీఆర్ పథకాలు కాపీ కొట్టి, ఆయనిచ్చినదానికంటే ఓ రూపాయి ఎక్కువ ఇస్తాం అని చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ సందర్భం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషయం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధికీ, నిరోధకులకు మధ్య పోటీ
తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ కు, అభివృద్ధి నిరోధకులైన మోడీ, కాంగ్రెస్ నాయకులకు మధ్య ప్రస్తుతం పోటీ జరుగుతున్నదని కేటీఆర్ అన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒక వైపుంటే, ఇంకో వైపు రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన కిషన్ రెడ్డి ఉన్నారని అన్నారు.
తెలంగాణకు ఏమీ ఇయ్యని నరేంద్ర మోడీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.మోడీ ఎవరికి దేవుడు? సిలిండర్ ధర 1250 కి పెరిగింది, పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇవ్వలేదు, 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. అలాంటి మోడీ తెలంగాణకు దేవుడెలా అవుతాడని ప్రశ్నించారు.
సుడిగాలి పర్యటన
మంత్రి కేటీఆర్ శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన ఎన్ఐటీ జంక్షన్ ను ప్రారంభించారు. ప్రగతి నగర్ లోని 15 బస్తీ దవాఖాన, ఎంఎల్డీ , టెక్నాలజీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణానికి భూమిపూజ, ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, వివిధ జంక్షన్లు, పోలీస్ భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, కేసీఆర్ భవన్, డబుల్ బెడ్రూం, వరద ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు.
కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, సవరాజు సారయ్య, నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్య, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ పాల్గొన్నారు.