రండి.. అందరం ఓటేద్దాం..100 శాతం పోలింగ్ సాధిద్దాం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఓటు బ్రహ్మాస్త్రం.. దేశాన్ని ప్రభావితం చేసే శక్తి, చైతన్యవంతులై స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని శివ్వంపేట మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫ్లాగ్ ఫాస్ట్, కేంద్ర పారామిలిటరీ సైనిక దళాల కవాతు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. నవంబర్ 10 నుంచి 25 వరకు ఓటరు గుర్తింపు స్లిప్లు అందజేస్తామని తెలిపారు. ‘నేను కచ్చితంగా గా ఓటు వేస్తాను’ నినాదంతో ప్రజలందరూ ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే ‘సీ’ విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. డబ్బు, మద్యం , ఏదైనా వస్తువుల అక్రమ పంపిణీ జరిగినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఫణీందర్, ఆర్డీఓ శ్రీనివాస్ రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారుల ఆట పాటలతో అలరించారు.