ఎంపీకే రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితేంటి?: భట్టి

- కేసీఆర్ పాలనలో అదుపుతప్పిన శాంతిభద్రతలు
- కాంగ్రెస్ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క
- కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి ఖండన
విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్షనేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన మంగళవారం పత్రికా ప్రకటనలో ఖండించారు.
పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్సలు ఉన్నాయా? అని అనుమానం కలుగుతోందన్నారు. దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం, దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజానిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను విస్మరించి, విపక్షాలపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.
దర్యాప్తు సంస్థలు, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని.. దాడికి నిరసనగా బంద్ కు పిలుపునిస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. బంద్ పిలుపు ఎవరిపైన ఇస్తున్నారు? బంద్ దేనికోసం? మీ పాలనపైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అంటూ నిలదీశారు.
దాడిపై సమగ్ర విచారణ చేసి, నిజానిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దాడులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే అహింస పార్టీ అని, ఇటువంటి దాడులను పూర్తిగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు.