రాక్షస పాలన అంతం కావాలి: ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణకు పట్టిన శని డిసెంబర్ 3న వదులుతుందని పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు

- డిసెంబర్ 3న తెలంగాణకు పట్టిన శని వదులుతుంది
- ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోము
- సంక్షేమం అందించే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి
- అధికారంలోకి వస్తే గడప గడపకూ సంక్షేమ పథకాలు
- పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణకు పట్టిన శని డిసెంబర్ 3న వదులుతుందని పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ మండలం గుద్దిమల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల తరువాత రాక్షస పాలన అంతం అవుతుందన్నారు. పేదల శ్రమదోపిడా చేస్తూ బీఆర్ఎస్ మోసం చేస్తున్నదని, ఉచిత హామీలు ఇస్తూ ప్రతి ఒక్కరినీ ఆగం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీయే అని విమర్శించారు.
ప్రజలపై బెదిరింపులకు పాల్పడితే ఇక సహించేది లేదన్నారు. అభివృద్ధి చేశామని అంటున్న అధికార పార్టీ నేతలు టంకర గ్రామం నుంచి గుద్దిమల్కాపూర్ వరకు రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ మండలంలో పదేళ్ళల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ గ్రామంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కనిపిస్తున్నాయి కానీ, ఒక్కటి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నదని, ప్రజలంతా ఒక వైపు, బీఆర్ఎస్ నాయకులు మరొక వైపు ఉండి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే గుద్ది మల్కాపుర్ గ్రామం నుంచి ఫతేపూర్ వరకు రోడ్డు వేయించి మీ కష్టాలను తప్పించడానికి మాట ఇస్తున్నా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొంటే, ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని, ప్రతి గడపకు సంక్షేమం అందించే బాధ్యత నాదే అని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మన భవిష్యత్తు బాగుపడాలంటే.. మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు కోసం… నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు ఆశపడి మీ జీవితాలను ఆగం చేసుకోకండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ బెక్కరి మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎన్పీ వెంకటేష్, మారెపల్లి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు టంకర కృష్ణయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.