Telangana | పార్టీల్లో ఎన్నికల కోలాహలం.. నలుగురు కలిస్తే రాజకీయాలపైనే చర్చ
Telangana | అసమ్మతిని బుజ్జగించే పనిలో బీఆరెస్ సీట్ల ఖరారుకు కాంగ్రెస్ నేతల కసరత్తు మరోవైపు లెఫ్ట్‌తో పొత్తు చర్చలు అభ్యర్థులను వెతుక్కుంటున్న బీజేపీ నెలాఖరుకల్లా మిగిలిన పార్టీల జాబితాలు (విధాత ప్రతినిధి) రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తున్నది. గ్రామాల్లోని రచ్చబండలు, నగరాల్లోని టీస్టాల్స్ దగ్గర, వర్సిటీల్లో నలుగురు విద్యార్థులు ఒక్కచోట కూర్చున్నా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? మీది ఏ నియోజకవర్గం? అక్కడ ఏ పార్టీ, ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా […]

Telangana |
- అసమ్మతిని బుజ్జగించే పనిలో బీఆరెస్
- సీట్ల ఖరారుకు కాంగ్రెస్ నేతల కసరత్తు
- మరోవైపు లెఫ్ట్‌తో పొత్తు చర్చలు
- అభ్యర్థులను వెతుక్కుంటున్న బీజేపీ
- నెలాఖరుకల్లా మిగిలిన పార్టీల జాబితాలు
(విధాత ప్రతినిధి)
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తున్నది. గ్రామాల్లోని రచ్చబండలు, నగరాల్లోని టీస్టాల్స్ దగ్గర, వర్సిటీల్లో నలుగురు విద్యార్థులు ఒక్కచోట కూర్చున్నా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? మీది ఏ నియోజకవర్గం? అక్కడ ఏ పార్టీ, ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉన్నది? అనే చర్చలే జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. నేతలు ఎవరి వాదనలు వినిపిస్తున్నారు. సెప్టెంబర్ నెల పూర్తయ్యే నాటికి అన్నిపార్టీల అభ్యర్థుల జాబితా రానున్నది. బీఆర్ఎస్ సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా తాము ఒంటరిగానే వెళ్తామని ప్రకటించినా టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి సాగవచ్చు అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఏ పార్టీలో ఏం జరుగుతుందో పరిశీలిస్తే…
బీఆర్ఎస్: అందరికంటే ముందుగా 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. నాలుగు చోట్ల అభ్యర్థులను ఖరారు చేయకుండా పెడింగ్‌లో పెట్టింది. ముందునుంచీ చెప్పినట్టే సిటింగ్‌లకే ఇచ్చామని, టికెట్ రాని నేతల్లో అసంతృప్తి ఉన్నా వారికి రానున్న రోజుల్లో ఇతర అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చింది. అయినా ఆ పార్టీలో నేతల అసంతృప్తి కొనసాగుతున్నది. పార్టీ అధినేతకు ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే… మరోవైపు హెచ్చరికలు కూడా పంపుతున్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి తమకు అవకాశమివ్వాలని కొన్ని నియోజకవర్గాల్లో నేతలు పట్టుబడుతున్నారు.
పార్టీ అధినేత హామీ ఇచ్చినా.. తమను పిలిచి మాట్లాడటం లేదన్నది మరి కొంతమంది నేతల ఆవేదన. అయితే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఆయన వచ్చిన తర్వాత అసంతృప్తులతో, అసమ్మతులతో చర్చించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థుల పరిస్థితిపై సర్వే చేయిస్తున్నారని తెలుస్తున్నది.
కాంగ్రెస్: కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో అదే వ్యూహాన్ని అక్కడ అమలు చేస్తున్నది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నది. దానికి అనుగుణంగానే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపడంపై దృష్టి సారించింది. ఉద్యమ సమయంలో జేఏసీలో కీలక పాత్ర పోషించిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల కాంగ్రెస్ వాళ్లంతా మనవాళ్లే అన్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి.
అయితే ఎన్నికలకు ముందు పార్టీని అస్థిరపరిచేందుకు పార్టీ అధినేత సూచనల మేరకే సుమన్ తన నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి అసంతృప్త, అసమ్మతి నేతల చేరికలపై ఆచితూచి వ్యవహరిస్తున్నది. చాలామంది నేతలు పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో దానికి అనుగుణంగా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నది.
బీజేపీ: ఖమ్మం సభతో ఉత్సాహంలో ఉన్న నేతలకు కేంద్ర హోం మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాలపై ఫోకస్ పెట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం సూచించింది. ఎన్నికలకు ముందే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని చెప్పింది. దీంతో అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర కమలనాథులు కార్యాచరణ సిద్ధం చేశారు. ముగ్గురు అగ్రనేతల నేతృత్వంలో అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిపి నిర్ధారించారు. రెండుమూడు రోజుల్లో పూర్తి స్థాయి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరు ఉన్నారో వెతికే పనిలో పడింది.
వామపక్షాలు: బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని చూసినా సాధ్యం కాలేదు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆయన ఏకపక్ష వైఖరిపై కామ్రేడ్లు కన్నెర్ర చేశారు. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. అవగాహన కుదిరితే సీపీఐ, సీపీఎం చెరో రెండు మూడు స్థానాల్లో బరిలోకి దిగవచ్చని తెలుస్తున్నది. లేదా ఆయా నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీకి మొగ్గుచూపవచ్చు. బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవుతున్నదనే ఆరోపణలు చేస్తున్న వామపక్షాలు ఈసారి ఆపార్టీని గద్దె దింపుతామని శపథం చేస్తున్నాయి.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ: రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తామన్న వైఎస్ షర్మిల కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహులతో ఆమె సమావేశమయ్యారు. సోనియా, రాహుల్‌లతో భేటీ అనంతరం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే వారితో చర్చించినట్టు, కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. పార్టీలో విలీనం చేస్తారా? లేక తాను పోటీ చేస్తానని ప్రకటించిన పాలేరు తో పాటు ఇంకా కొన్ని స్థానాల్లో ఆపార్టీ మద్దతు కోరుతున్నారా? అన్నది త్వరలో తేలుతుంది.
బీఎస్పీ: ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాత్రం తాను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్నది తెలియదు. ఇండియా, ఎన్డీఏ కూటములకు దూరంగా ఉంటామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుందా? లేక జాతీయ విధానాన్నే రాష్ట్రంలో అమలు చేస్తుందా? అన్నది చూడాలి.
తెలంగాణ జన సమితి: అధ్యక్షుడు కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చూడాలి. ఉద్యమకారులతో ఇటీవల యోగేంద్రయాదవ్ భేటీలో కోదండరామ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉద్యమకారులలో కొంతమంది వివిధ పార్టీలలో ఉన్నారు. మరికొందరు అధికారపార్టీకి అనుకూలంగా ఉండగా ఇంకొందరు కాంగ్రెస్, బీజేపీలతో ఉన్నారు. దీంతో జన సమితి అధినేత కాంగ్రెస్‌తోనే వెళ్తారా? లేక స్వతంత్రంగా పోటీ చేస్తారా? అన్నది వేచి చూడాలి.