Viral Video | కూతురి ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్.. రాజస్థాన్‌లో ఒక తండ్రి దుస్సాహసం

Viral Video | సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం, వ్యూస్.. లైక్స్ కోసం కొందరు ప్రాణాలను పణంగా పెడుతూ పిచ్చి పనులు చేస్తుంటారు. జలపాతాల వద్ద, జలాశయాల్లో రీల్స్ చేస్తూ కొందరు.. ఎత్తయిన భవనాలపై మరికొందరు రీల్స్ చేస్తూ చనిపోయిన వార్తలు ఎన్నో చూశాం. ఇటీవల బెంగళూరులో ఒక యువతి.. విషాద భరిత రీల్ చేసేందుకు ఒక భవంతిపైకి వెళ్లి.. అక్కడ రీల్ చేసే సమయంలో కాలుజారి కిందపడి చనిపోయిన ఘటన కూడా విన్నాం. అయినా కొందరు మాత్రం మేం మాత్రం జాగ్రత్తగానే ఉంటాలే.. అనే పిచ్చి భ్రమలో రీల్స్ చేస్తూ మృత్యువాత పడుతూనే ఉన్నారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ తండ్రి తన కూతురి ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్ భరత్‌పూర్ కు చెందిన ఉమాశంకర్ దంపతుల కుటుంబం స్థానిక డ్యామ్ ను చూడడానికి వెళ్లింది. ఈ సందర్భంగా ఉమాశంకర్ తన కూతురుతో రీల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఆ పాపను ప్రమాదకరమైన ప్రాంతంలో కూర్చొనబెట్టి. డ్యామ్ కు ఆనుకొని ఉన్న ఓ ఐరన్ బీమ్ పై కూర్చోవాలని బలవంతపెట్టి కూర్చోపెట్టాడు. ప్రమాదకరంగా ఉన్న ఆ బీమ్ పై కూర్చోవడానికి ఆ అమ్మాయి భయపడుతూనే తండ్రి చెప్పినట్లుగా కూర్చుంది. ఈ వీడియోను శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో పిల్లలకు మంచి బద్ధులు నేర్పాల్సిన తల్లిదండ్రులు ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీడియో కోసం తన కూతురును ప్రమాదంలోకి నెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఆ పసి హృదయం ఎంత భయపడి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోను సదరు వ్యక్తి డిలీట్ చేశాడు.
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025