Revanth, Harish | సీఎం సిద్దిపేట టూర్‌.. హరీశ్‌ లేఖతో రాజుకున్న రాజకీయ సెగ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి పెరిగింది. నర్మెటలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించడమే కాకుండా ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీష్ రావు చేసిన విమర్శలతోపాటు, సీఎంకు రాసిన లేఖ ఈ రాజకీయ వేడిని రగిలించింది.

Revanth, Harish | సీఎం సిద్దిపేట టూర్‌.. హరీశ్‌ లేఖతో రాజుకున్న రాజకీయ సెగ

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Revanth, Harish | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సెగ రాజుకుంది. నర్మెటలో ఆయిల్ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించడమే కాకుండా ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌ రావు చేసిన విమర్శలతోపాటు, సీఎంకు రాసిన లేఖ ఈ రాజకీయ వేడిని రగిలించింది. హరీష్ రావు చేసిన విమర్శలపై సహజంగానే విమర్శలు, ప్రతి విమర్శలకు దూరంగా ఉండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రతిస్పందించడం గమనార్హం. హరీష్ రావు లేఖకు ప్రతిగా తెలంగాణ అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి లేఖ రాసి ఈ వేడిని మరింత పెంచారు. ఇదిలా ఉండగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవు. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ దాదాపు ప్రధానమైన జిల్లాల్లో పర్యటించి భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. చివరి సమావేశం సిద్ధిపేటలో ముందుగా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత ఆనివార్యకారణాలతో ఆ సభను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర మంతా పర్యటిస్తున్న సీఎం.. సిద్ధిపేటకు రావాలంటే భయపడుతున్నారని, హరీశ్‌ రావు అంటే ఒంట్లో వణుకు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు సీఎం పర్యటన రద్దు పై తీవ్ర విమర్శలు చేసిన హరీశ్‌ రావు ఇప్పుడు సిద్ధిపేట జిల్లాకు వస్తున్నప్పుడు విమర్శలు చేయడంలో ఔచిత్యమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగానే సీఎం వస్తున్నపుడు స్వాగతించాలి కదా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులైతే ఎవరంటే ఎవరికి భయమంటూ సెటైర్లు వేస్తున్నారు. సీఎం పర్యటనకు ముందే పరస్పర విమర్శలు, లేఖాస్త్రాలను సంధించుకోవడంతో సిద్ధిపేట రాజకీయం వేడెక్కింది. ప్యాక్టరీ ప్రారంభం, సభ పూర్తయ్యేటప్పటికీ ఈ వేడి మరింత పెరిగే అవకాశముందంటున్నారు. అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కావడంతో ఇరు పార్టీలు రాజకీయంగా సై అంటే సై అంటున్నారు.

రిబ్బన్ కటింగ్ మాత్రమే కాంగ్రెస్ పని: ఎమ్మల్యే హరీశ్‌ రావు

బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించి, పూర్తైన వాటికి రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ చేస్తున్న పని అంటూ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. అంతేకాకుండా అనేక విషయాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. సిద్దిపేటలో రేపు ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్‌ ఫ్యాక్టరీకి, 2021లో జీఓ ఇచ్చి, రూ. 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్‌ ఫ్యాక్టరీ రావడంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకమన్నారు. రేపు నర్మెటలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్‌ ఫ్యాక్టరీకి కూడా ప్రతీ సంవత్సరం 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ఆధారంమంటూ వివరించారు. కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారాలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, చిల్లర మాటలు మానుకోవాలంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో పాటు శిలాఫలకాలు వేసింది తామైతే రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణ క్రెడిట్ అంతా తమదే అంటూ పేర్కొన్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎవరు కట్టారు: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

ఒక ప్రభుత్వ హయంలో చేపట్టిన పనులు మరో ప్రభుత్వ హయంలో ప్రారంభించడం సాధారణ విషయమని, ఇది మరిచిపోయి రాజకీయంగా విమర్శించడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ హయంలో కాళేశ్వరం కట్టారని, కానీ, దీనికి ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలాంటిదని, ఈ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో నిర్మించారని, మిగిలిన పని మీరు పూర్తి చేశారని అంత మాత్రానా ఆ ప్రాజెక్టు మీరు కట్టారా? అంటే సరైంది కాదని అన్నారు. భారీ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ఒక ప్రభుత్వం చేపడితే మరో ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభిస్తుందని దీన్ని సంకుచితతత్వంతో విమర్శించడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

శిలాఫలకాల మీదనే మీకు శ్రద్ధ?: చైర్మన్ జంగా రాఘవరెడ్డి

శిలాఫలాకలాల మీదున్న శ్రద్ధ రైతు సంక్షేమం మీద బీఆర్ఎస్ కు లేదని, సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతుంటే హరీశ్‌ రావులో వణుకు మొదలైందని అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తన బహిరంగలేఖలో హరీష్ కు కౌంటర్ ఇచ్చారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మీ హయాంలో కేవలం పునాది రాళ్లు మాత్రమే వేశారు. మలేషియా టెక్నాలజీతో, పూర్తిస్థాయి నిధులతో పూర్తి చేసి రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకితం చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కక్కుర్తి వల్ల పనులు నత్తనడకన సాగిందన్నారు. కాళేశ్వరం వల్లనే తేమ పెరిగిందని వింత వాదనలు చేస్తున్నారు.లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు తెలివితేటలు ఎక్కడికి పోయాయంటూ ప్రశ్నించారు. రూ.1070 కోట్ల నిధులు రద్దు చేశారని గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ముందు కేటాయించిన ఆ “కాగితపు నిధుల” గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. రుణమాఫీ, రైతు భరోసా.. లెక్కలు సరిచూసుకోండంటూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.