HCU Lands | పారాహుషార్‌!! హైదరాబాద్‌లో 1 నుంచి 4 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు!

ప్రత్యేకించి కంచ గచ్చిబౌలి అటవీ భూములు హైదరాబాద్‌ నగర ఉష్ణోగ్రతల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షపాతాన్ని ప్రభావితం చేయడంలో కూడా ముఖ్య పాత్ర కలిగి ఉన్నాయని అంటున్నారు పర్యావరణ నిపుణులు.

HCU Lands | పారాహుషార్‌!! హైదరాబాద్‌లో 1 నుంచి 4 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు!

HCU Lands | హెచ్‌సీయూ విద్యార్థులు, ఫ్యాకల్టీతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా సుమారు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని చదును చేసింది. ఆ భూములను వేలానికి పెట్టనున్నారు. ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటీ పార్క్‌లు, అర్బన్‌ స్పేస్‌లు నిర్మించేందుకు నిర్వహించే వేలంతో సుమారు పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అయితే ఈ చర్యలను యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణం తీవ్రంగా విధ్వంసానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు
కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని చదును చేయడంతో ఇక్కడ ఉంటున్న వేల వన్యప్రాణులకు చోటు లేకుండా పోతుంది. అంతేకాదు.. ఇక్కడి చెట్లను నరికివేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి నాలుగు డిగ్రీల మేర పెరుగుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భూముల విషయంలో ఏప్రిల్‌ 7వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నది.

డీమ్డ్‌ ఫారెస్ట్‌ హోదా
రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లిలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములకు “డీమ్డ్ ఫారెస్ట్” హోదా ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 1996 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అటవీ లక్షణాలు కలిగిన భూములను కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించడం, అభివృద్ధి చేయడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఈ భూమి సుమారు 237 జాతుల పక్షులు, నెమళ్లు, మచ్చల జింకలు, ఇండియన్ రాక్ పైథాన్ వంటి అరుదైన జీవ జాతులకు ఆవాసంగా ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు చేపడితే అనేక అరుదైన పక్షులు, జంతుజాలాల ఆవాసాలు నాశనమైపోతాయని చెబుతున్నారు. ఇది స్థానిక జీవవైవిధ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ పెద్ద ఎత్తున కాంక్రీట్‌ నిర్మాణాలతో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ భూమిలో రాతి నిర్మాణాలు, చిన్న నీటి వనరులు అనేక ఉన్నాయి. ఇవి నాశనమైతే.. భూగర్భ నీటి వనరులు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ అటవీ భూములు హైదరాబాద్‌ నగర ఉష్ణోగ్రతల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షపాతాన్ని ప్రభావితం చేయడంలో కూడా ముఖ్య పాత్ర కలిగి ఉన్నాయని అంటున్నారు. వీటి వలన నగర ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యానికి కీలకంగా ఉన్న ఈ భూములను యథాతథంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.