HYDRA । చెరువుల కబ్జాలు తొలగించాల్సిందే.. కానీ.. హైడ్రాలో అదే అసలు లోపం!

చెరువులు, నాలాలు, మూసీలో జరిగిన ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలన్నీ తీసి వేయాల్సిందే... కానీ మొదట దీనికి కారకులైన నేతలు, అధికారులు, బిల్డర్లు, భూములు అక్రమంగా అమ్మిన వారందరినీ శిక్షించకుండా వదిలేయడం భావ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

HYDRA । చెరువుల కబ్జాలు తొలగించాల్సిందే.. కానీ.. హైడ్రాలో అదే అసలు లోపం!
  • నేరం ఎవరిది? శిక్ష ఎవరికి? హైడ్రా పర్యవసానాలేంటి?
  • బలవుతున్నది సామాన్యులే.. బడా బాబులు సేఫ్‌
  • అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలేవి?

HYDRA । ప్రజాస్వామ్య భారతావనిలో నేరం చేసిన వాడు… నేరానికి పురికొల్పిన వాడు ఇద్దరు భద్రంగా ఉన్నారు.. కానీ ఆ నేరానికి మోసపోయిన సామాన్యుడు నేడు బలి అవుతున్నాడు. దశాబ్దాల కాలంగా హైదరాబాద్ (Hyderabad)) మహా నగరంలో వ్యవ‌స్థీకృతంగా జరిగిన చెరువుల ఆక్రమణలు (systematic encroachment), మూసీ నదీ ఆక్రమణలు, గొలుసు కట్టు చెరువుల లింకుల కోసం వర్షపు నీరు వెళ్లేలా సహజసిద్ధంగా ఏర్పడిన కాలువల (canals) (నాలాలు) ఆక్రమణలు, వాటిల్లో జరిగిన నిర్మాణాల తీరును పరిశీలిస్తే సగటు జీవులు నేడు ఏవిధంగా బలయ్యారో అర్థం అవుతున్నది.

మొదటి దోషులు రాజకీయ నేతలే!

హైదరాబాద్ (Hyderabad) ఆక్రమణలకు పరోక్షంగా రాజకీయ నాయకులే కారణమన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో బస్తీ నాయకులు, బడా బిల్డర్లు, చోటా బిల్డర్లు ఎవరికి వారుగా తమ పలుకుబడిని ఉపయోగించి భారీ నిర్మాణాలు (huge constructions) చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతుల కోసం ఏకంగా ఎఫ్‌టీఎల్‌(FTL), బఫర్ జోన్ల(buffer zones)నే మార్చివేశారంటే వీరి బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ భారత్ యూనియన్‌లో విలీనం అయిన తరువాత నగరం, శివారు ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లను ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదంటేనే పాలకుల నైతికత ఏపాటితో అర్థం అవుతోంది. దీనికి పురపాలక శాఖలో పీకలలోతు పాతుకు పోయిన అవినీతి (corruption) కూడా తోడైంది. అంతే క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండా అడ్డగోలుగా భారీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అంతే చెరువులు కాస్తా కాలనీలు, భారీ అపార్టుమెంట్లు అయ్యాయి. నాలాలపై భారీ భవనాలు వచ్చాయి. మూసీ రివర్ బెడ్‌లో బస్తీలు, కాలనీలు, అపార్ట్ మెంట్లు, కార్ఖానాలు వెలిశాయి. హైదరాబాద్ మహానగరంలో అతి ఖరీదైన ప్రాంతంలో ఉన్న దుర్గం చెరువు (Durgam Cheruvu) ఎఫ్ టీ ఎల్ పరిధిలోనే అనేక కాలనీలు, అపార్టుమెంట్లు వెలిశాయి. ఎఫ్‌టీఎల్‌ను గుర్తించే హద్దు రాళ్లను కూడా పట్టించుకోకుండా లేఅవుట్లు వేసి అమ్మారు. కొన్నవాళ్లు బంగళాలు కట్టారు. చెరువులో నీళ్లు పూర్తి స్థాయిలో నిండకుండా కిందకు వదిలేస్తారు. ఇలా ఒక్క దుర్గం చెరువు మాత్రమే కాదు… హెచ్ ఎండీ ఏ (HMDA) పరిధిలో ఉన్న అనేక చెరువుల పరిస్థితి ఇది. కొన్ని చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. రాత్రికి రాత్రే చెరువు కట్టలను తీసి వేసి లేఅవుట్లు వేసి చెరువులనే ఆక్రమించిన ఘనులున్నారు. నడిచెరువులో సినిమా టాకీస్‌లు కట్టి వ్యాపారం చేస్తున్న బడాబాబులున్నారు. తాజాగా మూసీ రివర్ బెడ్‌ (musi rever bed)లోనే భారీ నిర్మాణాలు చేస్తున్న కార్పొరేట్ పెద్దలున్నారు. ప్రభుత్వం కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా సింగరేణి కాలనీకి భూమిని సరూర్ నగర్ చెరువు ఎఫ్ టీ ఎల్ లో కేటాయించడం గమనార్హం.

అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే

అక్రమ నిర్మాణాలకు బిల్డర్లు ఒక్కరే కారణం కాదు… వ్యవ‌స్థీకృతంగా జరిగిన నేరంలో ఆయా సమయాల్లో అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, పదవుల్లో ఉన్న అధికారులు కూడా కారకులే… తమపై ఒత్తిడి వచ్చింది కాబట్టి పర్మిషన్ ఇచ్చామని చెప్పి అధికారులు తప్పుకోవడానికి ఇక్కడ వీలు లేదు. కొంతమంది అధికారులు తాము ఫోకల్‌ పోస్టుల్లో ఉండాలని, నాలుగు రాళ్లు వెనుకేసు కోవాలని ఆశ పడడంతోనే అసలు పతనం మొదలైంది. అంతే దీనికి అవకాశంగా తీసుకున్న రాజకీయ నేతలు నీకు కావాల్సింది నీవు తీసుకో… కానీ పని చేయి.. లేదంటూ  పోస్ట్ ఉండదని హెచ్చరించి మరీ అక్రమాలు చేయించారు. గత ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ(ghmc)లో డిప్యూటీ కమిషనర్ గా ఉన్న ఒక అధికారి ఒక రాజకీయ నాయకుడు ఖానా మెట్ లో 3 ఎకరాలు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్లు ఇవ్వ మంటే ఇవ్వనందుకు బదిలీ అయ్యాడు. నాటి నుంచి నేటి వరకు పోస్టింగ్ లేకుండా అనామకమైన పోస్టులో ఉంటున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే చెరువులో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై హైడ్రా కేసులు కూడా నమోదు చేయాల్సి వచ్చింది.

మొత్తం చెరువులు 185 కబ్జాలో 134

జీ హెచ్ ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉంటే 44 ఏళ్లలో134 చెరువులు కబ్జా అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. 134 చెరువుల్లో 15 వేల ఆక్రమణలున్నాయని గుర్తించింది. ఇందులో 8 వేల పైన నిర్మాణాలు ఎఫ్ టీ ఎల్  పరిధిలో ఉండటం గమనార్హం. మరో 5 వేలు బఫర్ జోన్‌లలో ఉండగా, మిలిగినవి నాలాలపైన ఉన్నట్లు సమాచారం. మూసీ రివర్ బెడ్‌లో దాదాపు 1600 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. గత బీఆరెస్ ప్రభుత్వం నగరంలోని నాలాలపైన 20 వేల అక్రమ నిర్మాణాలున్నట్లు ప్రకటించింది కూడా. కబ్జాల ప్రభావం వల్ల నగరంలో చినుకు పడితే చాలు ఎక్కడ ముంపునకు గురవుతామో అన్న భయంతో వణికి పోతున్నారు. ఆక్రమణల (encroachment) కారణంగా కుచించుకుపోయిన నాలాలు చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు కాలనీలు, బస్తీలలు వరద ముంపుకు గర వుతున్నాయి. రోడ్లపై వరద నీరు పొంగి భారీ వాగులను తలపిస్తున్నాయి. 2000, 2016, 2020,  2024 లలో కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) అనేక కాలనీలు నీట మునిగాయి. వరద ముంపుపై ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ నీళ్లు మనం ఉన్న ప్రాంతానికి రాలేదని, నీళ్లుండే ప్రాంతానికే మనం వెళ్లి బలంతంగా అక్కడ నీళ్లు లేకుండా చేశామని అన్నారు. వరదలు వచ్చినప్పడు వాటి చోటుకు అవి వచ్చాయని, అక్కడ మనం తిష్ఠ వేసి వరద నీళ్లు వచ్చాయంటే అర్థం ఏమి ఉంటుందని వ్యాఖ్యానించారు.

వాటర్‌ బాంబ్‌పై ఉన్నట్టే 

చెరువులు, మూసీ నదితోపాటు నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించకపోతే హైదరాబాద్ మహానగర వాసులు నిత్యం వాటర్ బాంబ్ పై ఉన్నట్లేనని పర్యావరణ ప్రేమికుడొకరు అన్నారు. ఈ వాటర్ బాంబ్ (water bomb) ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా  రాజకీయ నాయకులు, అధికారులు, బడాబాబులు అంతా కలిసి చేసిన ఈ నేరంలో నేడు సమిధలవుతున్నది అతి సామాన్యులు, వేతనజీవులేనని ఆయన అన్నారు. కాయ కష్టం చేసి ఇంత గూడు వేసుకున్న వాళ్లు కొందరైతే.. భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసి బ్యాంకు రుణాలు తీసుకొని ఈఎంఐలు (emi) చెల్లిస్తూ ఇండ్లు కొనుక్కున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరంతా నేడు తమ జీవితాలేమిటని పాలకులను ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్న, ఆందోళన న్యాయమైనదే.. తమ ఇల్లు పోతే ఇక జీవితం అంధకారం అవుతుందని తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. సామాన్యుల ఆందోళనలో అర్థం ఉంది. కానీ ఆక్రమణలు తొలగించకుండా వాటర్ బాంబ్ ను డిస్పోజ్ చేయడం సాధ్యమవుతుందా? అన్నదే వేయి డాలర్ల ప్రశ్న.  వ్యవ‌స్థీకృతంగా జరిగిన నేరానికి సామాన్యులే బలి అయ్యరనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆక్రమణలు తొలగించకుంటే ఇంతకన్నా ఎక్కువ నష్టం జరిగితే ఎలా? ఇది ఊహకే అందని ప్రశ్న.

ఆనాడు అన్న బాగున్నా..

హైదరాబాద్ మహా నగరానికి 1591 నుంచి 1908 వరకు 14 సార్లు భారీ వరదలు వచ్చాయి. 1908లో వచ్చిన వరదల్లో 15 వేల మంది చనిపోయారు. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు వదరల్లో కొట్టుకు పోయాయి. ఆనాడు హైదరాబాద్ నగర జనాభా 1901 లెక్కలప్రకారం 4.48 లక్షలు మాత్రమే. హైదరాబాద్ నగరం దిన‌దినాభివృద్ధి చెందింది. జనాభా కోటి మార్క్ ను దాటింది, నాడు ఉన్న కొద్ది జనాభా కే అంత నష్టం జరిగితే… ఇప్పడున్న కోటి జనాభాకు అంత పెద్ద వరద వస్తే ఎంత నష్టం జరుగుతోందో ఊహకే అందని విధంగా ఉంటుంది. పైగా నాడు నదిలో ఆక్రమణలు లేవు, చెరువులున్నాయి, కాలువలున్నాయి… నేడు నదిలో ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ పరిస్థితో నాటి స్థాయిలో వరదలు వస్తే హైదరాబాద్ మరో వాయనాడ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నది మాత్రం వాస్తవమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పర్యావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ లు అవుతున్న కాలం … ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒకే చోట గంటలోపే 20 సెంటీ మీటర్ల వర్షం కురుస్తున్న రోజులివని గుర్తు చేస్తున్నారు. మహానగరం నెత్తిన పిడుగులా ఉన్న వాటర్ బాంబ్ నుంచి రాజకీయాలకు అతీతంగా అందరు కలిసి కాపాడు కోవాల్సిన సమయం అసన్నమైంది. చెరువులు, నాలాలు, మూసీలో జరిగిన ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలన్నీ తీసి వేయాల్సిందే… కానీ మొదట దీనికి కారకులైన నేతలు, అధికారులు, బిల్డర్లు, భూములు అక్రమంగా అమ్మిన వారందరినీ శిక్షించకుండా వదిలేయడం భావ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో బాధితులందరినీ ఆదుకోవాల్సిన బాద్యత పాలకులపై ఉందని చెపుతున్నారు. సామాన్యులెవరికీ చెరువుల్లో, నాలాలపైన బఫర్ జోన్లలో నిర్మించిన ఇండ్ల గురించి తెలియదు.. జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, డీసీటీపీ అనుమతులు ఇచ్చింది కాబట్టే.. కొనుగోలు చేశారు. వాటి అనుమతులు చూసుకున్న ప్రజలు బ్యాంకులను సంప్రదించి రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశారు. వాటిల్లో నివాసాలుంటున్నారు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేపట్టిన చర్యల కారణంగా చివరకు అన్ని చూసుకొని ఇంటిని కొనుక్కున్న అతి సామాన్యుడు బలవుతున్నాడు.

పేదలను బలి చేసి ఆక్రమణల తొలగింపా?

పాలకులు ఆక్రమణలు తొలగించాలి. కానీ పేదలను బలి చేసి తొలగిస్తారా? వారి నష్టానికి పరిహారం ఇప్పించాలి కదా? మరోచోట వారందరికీ ప్రత్యామ్నాయం చూపించాలి… ప్రత్యామ్నాం లేకుండా చేస్తున్న చర్యలే నేడు ప్రతిపక్షానికి ఆయుధాలయ్యాయి. బాధితులను వెంటేసుకొని ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకుండా బాధితలకు ప్రత్యామ్నాయం చూపించడం, బ్యాంకులతో మాట్లాడి రుణాలు తీసుకున్న వారిని రుణ విముక్తులను చేయడంతో పాటు, దీనికి కారణమైన నాటి అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించడంతో పాటు.. ఈ నష్టాన్ని వారినుంచే వసూళ్లు చేయాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.