లక్షల సీసీ కెమెరాలు ఉన్నా.. భగీరథ్ కదలికలు పసిగట్టలేకపోతున్నారా?
రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వెంటాడి వేటాడుతామని పోలీసులు గతంలో ప్రకటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను పట్టుకోవడంలో ఈ ఆధునిక సాంకేతిక పనిచేయడం లేదా? లేక ఉద్దేశపూర్వకంగానే ప్రజలను మభ్యపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై వారం దాటినా ఇంతవరకు పట్టుకోలేకపోయారంటే తెర వెనుక ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అంశం ప్రజల చర్చల్లో చోటు చేసుకుంటున్నది.
విధాత, హైదరాబాద్:
పోక్సో కేసు ఉన్న భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో తెలంగాణలోని సీసీ కెమెరాలు, వాటి ఆధారంగా పనిచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు ప్రశ్నలను లేవనెత్తుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్షల సీసీటీవీలు స్తంభాలకు కనిపిస్తుంటాయి. ఎంపిక చేసిన జంక్షన్లలో హై రెజుల్యూషన్ కెమెరాలను కూడా అమర్చారు. కరీంనగర్‌లో కూడా సీసీటీవీలు పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఇన్ని ఉన్నా భగీరథ్ కదలికలను పోలీసులు ఇప్పటి వరకూ గుర్తించలేకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 8వ తేదీ సాయంత్రం బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర పర్యటన నేపథ్యంలో 11వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మూడు రోజులు నాన్చారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, సోషల్ మీడియా దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఫోన్ రావడంతో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన డీజీపీ సీవీ ఆనంద్‌ను పిలిచిన ముఖ్యమంత్రి.. కేసు పూర్వాపరాలు తెలుసుకుని, తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. అదే రోజు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సైతం నోటీసులు జారీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తోపాటు బాధిత కుటుంబ సభ్యులతో డీసీపీ రితురాజ్ సమావేశమయ్యారు. అంతకు ముందు నమోదు అయిన పోక్సో, ఇతర సెక్షన్లు బలహీనంగా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని మరింత కఠిన చట్టాలను చేర్చి మార్చారు. ఈ చర్యతో ఒకింత పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. కానీ, అరెస్టు విషయంలో అడుగు ముందుకు పడడం లేదు.
వచ్చే గురువారం విచారణ
బాధిత బాలిక వయస్సు 18 సంవత్సరాలు నిండిందని, ఆమె మేజర్ అంటూ సాయి భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం రాత్రి విచారించిన జడ్జి తంగిరాల మాధవి.. ఎలాంటి తీర్పు ఇవ్వకుండా, పోలీసుల నుంచి రక్షణ కల్పించకుండానే వచ్చే గురువారానికి వాయిదా వేశారు. ఈ తీర్పు కోసం అటు సాయి భగీరథ్ కుటుంబం, ఇటు సైబరాబాద్ పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో గాలింపు కోసం పోలీసులు ఐదు టీమ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమోనన్న విమర్శల దాడి మొదలైంది. పోక్సో కేసు నమోదు అయిన తరువాత భగీరథ్‌ను వెంటనే అదుపులోకి తీసుకోకుండా, పారిపోయే అవకాశం కల్పించేలా పోలీసులు వ్యవహరించారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.
నగరమంతా సీసీటీవీ కెమెరాలు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వందల కోట్లు వెచ్చించి సీసీటీవీలను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ముఖ్యమైన ప్రాంతాలలో ఒక కిలోమీటర్ దూరం వరకు స్పష్టంగా కన్పించే హై డెఫినేషన్ కెమెరాలను అమర్చారు. వీటి సాయంతో నిందితులు ఎక్కడికి పోయారు, వారి కదలికలు స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని లక్షల సీసీటీవీలను అనుసంధానం చేసిన ఈ సీసీసీలో ప్రతి అంగుళాన్ని 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించే వెసులుబాటు ఉంది. ఒకేసారి లక్ష కెమెరాలను వీక్షించవచ్చు కూడా. ఒకవేళ హైదరాబాద్ లో లేనట్లయితే కరీంనగర్ లోని సీసీటీవీలను జల్లెడ పడితే గుట్టు రట్టు అవుతుంది. ఈ సీసీటీవీలు అన్నీ బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. అక్కడ పూర్తి డాటా లభ్యమవుతుంది. ఏ సమయంలో నైనా, ఎక్కడైనా ఘటన జరిగిన క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక దీని సొంతమని సీనియర్ పోలీసు అధికారులు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి.. భగీరథ్‌పై కేసు నమోదు చేయడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి సీసీటీవీ రికార్డులు పరిశీలిస్తే నిందితుడిని పట్టుకోవడం ఏమంత కష్టం కాదని ఐటీ నిపుణులు అంటున్నారు.
ఆధునిక పరిజ్ఞానం ఉన్నా ఎందుకీ జాప్యం?
ఇంతటి ఆధునిక సాంకేతిక అందుబాటులోకి ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి కుమారుడిని పట్టుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుందనే ప్రశ్నలు సాధారణ ప్రజలు లేవనెత్తుతున్నారు. ఒకటి ప్రభుత్వ పెద్దల నుంచి రక్షణ ఉండడం లేదా రెండోది పోలీసులకు పరోక్షంగా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని కదలికలు, మొబైల్ ఫోన్ కాల్ డాటా, స్నేహితుల కదలికలు, సన్నిహిత బంధువుల మొబైల్ ఫోన్లపై నిఘా పెడితే పట్టుకోవడం ఏమంత కష్టం కాదంటున్నారు. కేంద్ర మంత్రి కావడంతోనే ఇంత ఆలస్యం జరుగుతోందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడు ముందుకు వచ్చి లొంగిపోతే కానీ పోలీసులు పట్టుకోరా అని నిలదీస్తున్నాయి. సాంకేతికతో గంటల వ్యవధిలో కేసును ఛేదించామని చెప్పుకొనే పోలీసు పెద్దలు.. ఈ కేసు విషయంలో దూకుడుగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాసులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసు విషయంలో నాన్చుడు వైఖరి అవలంభిస్తున్నారని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకోవచ్చని ప్రతి నలుగురు కలిసిన చోట చర్చించుకుంటున్నారు.
Read Also |
మూడేళ్లలో కేంద్రాన్ని అడిగింది.. రూ. 85,677 కోట్లు… ఇచ్చింది రూ. 28,065 కోట్లు
షాకింగ్ ఘటన.. రూ.2వేలు అద్దె చెల్లించలేక యజమాని వద్దకు భార్య, బిడ్డ
బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసుల జారీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram