Secretariat | సర్కారులోనే లీకు వీరులు.. గేటు దాటుతున్న కీలక విషయాలు?
ప్రభుత్వం ఒక పని చేయాలని ఆలోచన చేస్తుండగానే.. ఆ విషయం విపక్షాలకు తెలిసిపోతుంటుంది. ఒక నిర్ణయం తీసుకోగానే.. వెంటనే ప్రతిపక్ష పార్టీల మీడియాకు లీకులు వెళ్లిపోతాయి.. గత ప్రభుత్వ హయాం నుంచి పాతుకుపోయిన కొందరు అధికారులు.. ప్రతిపక్షాలకు ఉప్పందిస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

- సచివాలయం గోడలకు చెవులు!
- విపక్ష నేతలకు వెంటనే చేరవేత!
- ఆలోచన సమయంలోనే ఉప్పు
- విపక్ష పార్టీ మీడియాతో సంబంధాలు
- సీఎం పీఆర్వోలో ఓ అధికారి తెగింపు
- గతంలోనే పలువురి బదిలీలు..
- అయినా దర్జాగా సమాచార మార్పిడి
- పాతుకుపోయిన పాత సిబ్బంది
- నిఘా వైఫల్యమా? సర్కార్ నిర్లిప్తతా?
Secretariat | కాంగ్రెస్ సర్కార్ (Telangana government) అంటేనే మహా సముద్రం. నాలుగు గోడల మధ్య చర్చించుకుంటున్న విషయాలు గోడలు దాటుతున్నాయి. గోడలకు చెవులు ఉన్నాయంటే ఇదేనమో. తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో ఏ ఫ్లోరులో, ఏ మంత్రి చాంబర్లో, ముఖ్య కార్యదర్శి చాంబర్లో ఏం జరుగుతున్నదో వెంటనే ప్రతిపక్షాలకు చేరిపోతున్నది. లీకులపై (leaked information) సీఎం ఏ రేవంత్ రెడ్డి ఎంత కఠినంగా ఉన్నా అవి ఆగడం లేదు. వారిపై చర్యలు కూడా లేవు. ముఖ్యమంత్రి ఎంత గుట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నా, ఆలోచనలు చేస్తున్నా ఆ విషయాలు కూడా విపక్షాల చెవుల్లోకి చేరిపోతున్నాయని (opposition advantage) సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కోటరీలోని వారు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు అదే పనిగా ప్రభుత్వ సమాచారం విపక్షాలకు నిమిషాల వ్యవధిలో చెప్పేస్తున్నారని (security breach) ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎలా చేరిపోతున్నాయో అర్థం కాక కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోతున్నారని అంటున్నాయి.
ఆ ఒక్కటి తప్ప
ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉప లోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ ఎవరికీ తెలియదు. కానీ అందరూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల పోస్టుల భర్తీకి సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందని అనుకోగా, అకస్మాత్తుగా అజెండా అంశం మారింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవులకు మాత్రమే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకుడు, ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావుకు నాలుగు రోజుల ముందు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించలేదు. ఈ ఒక్క సమావేశం మాత్రమే రేవంత్ రెడ్డి విషయం బయటకు పొక్కకుండా నిర్వహించడం గమనార్హం
విపక్షాలతో రాసుకుపూసుకు..
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక పౌర సంబంధాల అధికారి.. విపక్ష పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని తెలుస్తున్నది. మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఒక యజమాని చానల్లో తామంటే గిట్టని వారిపై ప్రత్యేక కథనాలను వండి వార్పిస్తున్నారని చెప్పుకొంటున్నారు. ఆ ప్రతినిధి తో కలిసి కారులో తిరుగుతూ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విషయాలను చెబుతున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ లాబీల్లో కూడా ఆయన ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే ప్రతినిధులతోనే సన్నిహితంగా మెలుగుతుండటం గమనార్హం. ఆయన గతంలో వారితో ఉన్న సాన్నిహిత్యం ఏమో కానీ మీడియా ప్రతినిధులు కూడా కాంగ్రెస్ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. ఏదైనా ఒక అంశం లేదా సమస్యపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన మరుక్షణమే విపక్ష పార్టీ నాయకుల చెవుల్లోకి ఆ సమాచారం అంతా చేరుతోంది. ఆలోచన చేసింది నిన్ననే కదా! అప్పుడే బయటకు ఎలా తెలిసిందంటూ కొందరు మంత్రులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరిన తరువాత తొలిసారి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించిన వివరాలు అక్షరం తేడా లేకుండా ప్రతిపక్షాలకు చేరిపోయాయి. ధరణి వెబ్ పోర్టల్ దుర్మార్గాలు, డ్రగ్స్ మహమ్మారిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే ఆ విషయాలన్నీ ప్రతిపక్ష నాయకులకు తెలిసిపోయాయి.
గతంలోనే ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి విషయం బయటకు పొక్కుతున్న విషయం గతంలోనే బయటకు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై.. ముఖ్యమంత్రితో ఈ విషయంపై చర్చించారని సమాచారం. ఫలితంగానే గత ముఖ్యమంత్రి వద్ద పనిచేసి, అక్కడే కొనసాగుతున్నవారిని గతేడాది జనవరిలో సమూలంగా మార్చివేశారని తెలుస్తున్నది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్తునే ఉంది. రాష్ట్రంలో సాగు అవుతున్న దొడ్డు, సన్న వడ్లు ఎన్ని? అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తే ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలను 2024 మే నెలలో ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, ప్రతిపక్షాలకు లీకు కావడం వెంటనే జరిగిపోయింది. ఇంకేముంది ప్రతిపక్షాలు దొడ్డు రకాలకు బోనస్ ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ముగ్గురు పోలీసు అధికారులు లీక్ చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాలు ప్రచార, ప్రసార సాధనాల్లో వస్తున్నా కాంగ్రెస్ సర్కార్ దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై సచివాలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
మంత్రుల వద్ద పాత ప్రభుత్వం వాళ్లదే హవా!
బీఆర్ఎస్ ప్రభుత్వంలో హవా చెలాయించిన పర్సనల్ అసిస్టెంట్లు, పర్సనల్ సెక్రటరీలు, ఓస్డీలు, పౌర సంబంధాల అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమిడిపోయారు. మంత్రుల వద్ద దర్జాగా పనిచేస్తూ ఎప్పటిలాగే తమ హవా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కులాన్ని అడ్డుపెట్టుకుని కొందరు పాగా వేయగా, ప్రాంతం, పాత పరిచయాలను అడ్డుపెట్టుకుని మంత్రుల వద్ద చేరిపోయారని అంటున్నారు. మరికొందరు అయితే బీఆర్ఎస్ నాయకుల సిఫారసులతో చేరారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలో ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి దగ్గర కూడా అమలు కాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏమైందో ఏమో కాని ఇంటెలిజెన్స్ నివేదిక అటకెక్కిందంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వారిలో కొందరికి ఈ ప్రభుత్వంలో కూడా పదవులు దక్కాయి. నిన్నటి వరకు తెర చాటున పనిచేసిన ఒక పీఏ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దర్జాగా తిరగడం కనిపించింది. ఏమన్నా ఆర్డర్ వచ్చిందా అంటే, అవును మంత్రిగారే ఇప్పించారు, అందుకే బయట దర్జాగా తిరుగుతున్నానంటూ చెప్పుకున్నాడు.
ఇంటెలిజెన్స్ వైఫల్యమా? సర్కార్ నిర్లిప్తతా?
తెలంగాణలో ఇంటెలిజెన్స్ వైఫల్యామా, ఒక వేళ ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసినా ఏమవుతుందిలే అని సర్కార్ నిర్లిప్తతలో ఉందా అనేది తెలియడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల భూ సేకరణ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థుల కంచ గచ్చిబౌలి వివాదం, మూసీ రివర్ అభివృద్ధిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని అప్రమత్తం చేశారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోకపోవడం మూలంగానే సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించినప్పటికీ ఎప్పటికప్పుడు ట్యాపింగ్ నిందితులకు సమాచారం వెళ్లిందని అంటున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతున్నది? కోర్టుకు ఏం చెప్పబోతున్నది? అనే విషయాలు నిందితులకు చేరడంతో వారు అప్రమత్తమయ్యారని ఉన్నతాధికార వర్గాల సమాచారం.
సీఎం కోటరీ, ఐఏఎస్, ఐపీఎస్ లేనా?
సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో ఉండేవాళ్లలో కొందరు ఏం తక్కువగా లేరని సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగే ప్రతి సమావేశంలో కూర్చుని వినడం, ఆ విషయాలను మీడియా ప్రతినిధులకు పంపించడం వారి విధి. ఆ పనితో పాటు ముఖ్యమైన విషయాలను బయటకు పంపించే పని కూడా చేస్తున్నారని తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఒకరిద్దరు మీడియా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, జీవోల సమాచారం ఇవ్వడం వెనక ఆంతర్యమేమిటో తెలియదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశాల్లో పాల్గొంటున్న అధికారులలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా కీలక సమాచారాన్ని బయటకు పంపిస్తున్నారని తెలుస్తున్నది. మంత్రులు నిర్వహించే సమావేశాల్లో కూడా పౌర సంబంధాల అధికారులు కూర్చుంటున్నారు. తమకు నచ్చని సమాచారం ఉన్నా, ప్రభుత్వం ఇరుకునపడే విషయం ఉన్నా.. గుర్తు పెట్టుకుని.. సమావేశం ముగిసిన తరువాత వేరే వ్యక్తుల ద్వారా ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారని విశ్వసనీయ వర్గాల కథనం.