కాంగ్రెస్ సర్కార్‌లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వరా? అధికారులేమంటున్నారు?
దాదాపు ఆరునెలలుగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు (Pattadar passbook) రాకపోవడంపై తెలంగాణ రైతులు (Farmers in Telangana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ (land registrations) పూర్తి అయిన తర్వత కూడా తమకు యాజమాన్య హక్కు పత్రాలు (ownership documents) అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అది సీసీఎల్‌ఏ (CCLA office) బాధ్యతని చేతులెత్తేస్తున్నారు.
- తాసిల్దార్ కార్యాలయం చుట్టూ రైతుల చక్కర్లు
- ముగిసిన పాస్‌బుక్కుల ముద్రణ కాంట్రాక్టు
- చోద్యం చూస్తున్న రెవెన్యూ శాఖ
- లక్షలాది మంది రైతుల ఆందోళన
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
పట్టాదార్ పాస్ పుస్తకం ఉంటే రైతుకు ధీమా. భూమి యాజమాన్య హక్కులు ఇందులో వివరంగా ఉంటాయి. భూ యజమానులు వీటిని భద్రంగా దాచుకుంటారు. పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీటిని ఉపయోగించుకుంటారు. ఇలాంటి విలువైన పాస్ పుస్తకాలను జారీ చేయడంలో రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలలుగా రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ పూర్తిగా నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్న వారు పాస్‌బుక్ అందలేదంటూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమకు పాస్ పుస్తకాలు ఇంకా రాలేదని, వాటిని ఎప్పుడు పంపిస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం.. అది తమ బాధ్యత కాదని, హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పోస్టులో వస్తాయని సమాధానం చెప్పి పంపించేస్తున్నారు. ఒక్కో పాస్‌పుస్తకానికి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. వాటిని పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
ఆర్నెళ్లుగా పత్తా లేని పాస్‌బుక్‌ల జారీ
రాష్ట్రంలో ఆరు నెలలుగా పట్టాదార్ పాసు పుస్తకాల జారీ నిలిచిపోయింది. అంతకు ముందు కూడా ఏడాది కాలంగా పోస్టులో బట్వాడా చేయడానికి రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకునేవారు. పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు ఈ ఏడాది జూలై నెలతో ముగిసింది. గడువుకు ముందు నుంచే ముద్రణ మందగించింది. కొత్తగా కంట్రాక్టు ఎంపిక చేసే వరకు పాత వారితో తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో కూడా నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. ప్రతి రోజు తాసిల్దార్ కార్యాలయాల్లో వేల కొద్దీ భూ లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మండలాల్లో తక్కువలో తక్కువ పది రిజిస్ట్రేషన్లు అవుతుంటే.. మరికొన్ని మండలాల్లో యాభైకి తక్కువ కాకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో 574 మండల తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రతిరోజూ పదివేలకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఒక అంచనా. అంటే నెలకు సుమారు మూడు లక్షల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు వెల్లడవుతున్నది. ఆరు నెలల వ్యవధిలో 18 లక్షల పాస్ పుస్తకాలను బట్వాడా చేయకుండా నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే భద్రతా ఫీచర్ల పేరుతో ముద్రణ కోసం కొనుగోలుదారుడి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో క్రయ విక్రయదారులు సంతకాలు చేసిన తరువాత దస్తావేజులను ఆన్‌లైన్‌లో సీసీఎల్ఏ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ముద్రణా సంస్థకు ఆన్‌లైన్‌లో చేరుతాయి. ఆ వివరాల ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకం ముద్రించి, నేరుగా కొనుగోలుదారుడికి పోస్టు ద్వారా బట్వాడా చేస్తారు. ధరణి అమలులో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తరువాత రెండు వారాల్లో పోస్టు ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం పంపించేవారు. ఈ మేరకు కొనుగోలుదారుడికి ఎస్ఎంఎస్ కూడా వచ్చేది.
భూభారతి వచ్చినా ఇవ్వరా?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ధరణి పోర్టల్ రద్ధు పేరుతో ఏడాదిపాటు కాలయాపన చేసి, రైతులను ఇబ్బంది పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు భూ భారతి వచ్చిన తరువాత కూడా పాస్ పుస్తకాలు పంపించకుండా సతాయిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ సమస్య మొదలైందని రైతులు, భూమి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. పాస్ పుస్తకం లేకపోవడంతో పంట రుణం తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పథకాలకు ఇదే ప్రామాణికం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లి అడిగితే, భూ భారతి పోర్టల్ నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చి పంపిస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర నుంచి పాస్ పుస్తకాల ముద్రణ కోసం డబ్బులు వసూలు చేసి.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోమంటారా? అంటూ మండిపడుతున్నారు. ఇదే సమస్యపై ప్రతినిత్యం పది నుంచి ఇరవై మంది సీసీఎల్‌ఏ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు మంగళం పాడేలా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉండి, భూమి స్వాధీనంలో ఉన్నప్పటికీ రైతులు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాస్‌బుక్ లేకుంటే.. రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Pregnant woman Weight Lifting | ఏడు నెలల గర్భిణి వెయిట్ లిఫ్టింగ్.. అమ్మ బాబోయ్ ఏకంగా 145 కిలోలే..!
Amazon Jobs Cut | 30వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్!
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..!
ChatGPT Go Free | చాట్‌జీపీటీ భారతీయ యూజర్లకు ఓపెన్‌ఏఐ బంపర్ ఆఫర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram