CLP Meeting | ఇటు ముగ్గురు డుమ్మా.. అటు నుంచి ముగ్గురే హాజరు! కార్పొరేట్ లెవల్లో సీఎల్పీ భేటీ
సీఎల్పీ సమావేశానికి మొత్తం 65 ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా, 62 మంది మాత్రమే వచ్చారు. కాంగ్రెస్‌నుంచి ఆ ముగ్గురు రాలేదు.. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యేల్లో ఆ ముగ్గురు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

(విధాత ప్రత్యేకం)
CLP Meeting | మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించి నడుచుకుంటామని ఖద్దరు టోపీలు పెట్టుకుని ఎన్నికల సమయంలో ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్పొరేట్ అవలక్షణాలు అంటుకున్నాయేమో! సీఎల్పీ సమావేశం నిర్వహించడానికి నగరంలో ఎన్నో ఫంక్షన్ హాళ్లు ఉండగా శంషాబాద్ ఎయిర్ పోర్టు సిటీలోని నోవాటెల్ ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహించడం కార్యకర్తల్లో చర్చలకు దారి తీసింది. ఇప్పటికే అంబేద్కర్ పేరిట కట్టిన సచివాలయానికి రాకుండా ఇంటి నుంచి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానికి తాజా సీఎల్పీ భేటీ నిర్వహించిన స్థలం మరో విమర్శకు తావిస్తున్నది. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. కార్పొరేట్ కంపెనీలు నిర్వహించినట్లుగా సమావేశం నిర్వహించడం గాంధీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నదనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ఎన్నో ఫంక్షన్ హాళ్లలో సీఎల్పీ సమావేశం నిర్వహించుకునే వెసులుబాటు ఉన్నా నోవాటెల్‌ను ఎంపిక చేసుకోవడం గమనార్హం. నాంపల్లిలోని గాంధీ భవన్ లో కూడా నిర్వహించుకునే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగించిన లిఫ్టులో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. 8 మంది మాత్రమే వెళ్లాల్సి ఉండగా, 13 మంది ఎక్కడంతో మొరాయించింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముఖ్యమంత్రిని బయటకు తీసుకువచ్చి వేరే లిఫ్టులో కిందకు పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల డుమ్మా
సీఎల్పీ సమావేశానికి మొత్తం 65 ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా, 62 మంది మాత్రమే వచ్చారు. విదేశీ పర్యటనలో ఉండటంతో మునుగోడు ఎమ్మెల్యే కే రాజగోపాల్ రెడ్డి రాలేకపోయారు. అదిలాబాద్ జిల్లాకే చెందిన చెన్నూరు ఎమ్మెల్యే జీ వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు హాజరుకాలేదు. వీరిద్దరూ వ్యక్తిగత పనులతో రాలేదా? లేక అలకబూనారా? అన్నది తెలియరాలేదు. తనకు మంత్రి పదవి రాకుండా సీనియర్ నాయకుడు కే జానారెడ్డి అడ్డుపడుతున్నారని, ధృతరాష్టుడి వలే ప్రవర్తిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ సమావేశంలో తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. తనకు పదవి ఇవ్వడం లేదంటూ వివేక్ వెంకటస్వామి కినుకతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేశానని, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆయన అంతర్గతంగా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని పట్టుకుని పనిచేస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ప్రేమ్‌సాగర్‌రావు అల్టిమేటం ఇచ్చారు. తనకు మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమేనని ఢిల్లీ పెద్దలను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి పదవులు ఇస్తారా అని పరోక్షంగా వినోద్, వివేక్ బ్రదర్స్ ను విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి హోదా ఇవ్వాలని కోరారు. తనకు పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని రంగారెడ్డి కొంచెం గట్టిగానే విమర్శించారు.
ఎంపీ చామలకు తలంటిన రేవంత్ రెడ్డి?
మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భువనగరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని తలంటారని తెలుస్తున్నది. ‘రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదు’ అంటూ మందలించారని సమాచారం. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలన్నది వారే చూసుకుంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలోకి కే రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి లను తీసుకోవాలని బహిరంగంగా చామల కిరణ్ సూచించడం రేవంత్ రెడ్డికి నచ్చకపోవడంతో సీఎల్పీ భేటీ మందలించారని తెలుస్తున్నది. ఇలాంటి గీత దాటే వ్యాఖ్యలను మున్ముందు కట్టడి చేసేందుకే మిగతా నాయకులకు అర్థమయ్యేలా సీఎం హెచ్చరిక చేశారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేమి మాట్లాడినా ప్రయోజనం ఉండదని, పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యమన్నారు. పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారనీ సమాచారం.
హాజరైన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. వాదోపవాదాలు పూర్తయ్యాయి. నేడో రేపో సుప్రీంకోర్టు ధర్మాసనం తుదితీర్పు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎల్పీ భేటీకి హాజరయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్నారు.