Telangana | ‘విద్యుత్’ డైరెక్ట‌ర్ల భ‌ర్తీ ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ‌లో డైరెక్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం కనిపిస్తున్నది. నాలుగు సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న 22 మంది డైరెక్ట‌ర్ల‌ను మూకుమ్మ‌డిగా తొల‌గించి 17 నెల‌లు అవుతున్నా ఇంత వ‌ర‌కు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం గమనార్హం.

Telangana | ‘విద్యుత్’ డైరెక్ట‌ర్ల భ‌ర్తీ ఎప్పుడు?

నోటిఫికేష‌న్ జారీచేసి 17 నెల‌లు
సెలక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూలు పూర్తి
అయినా నియామకాలు పెండింగ్‌
ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్న సంస్థలు
గతంలో 22 మంది డైరెక్టర్ల తొలగింపు
పదవుల కోసం భారీగా పైరవీలు

Telangana | హైద‌రాబాద్‌, మే 12 (విధాత‌) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ‌లో డైరెక్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం కనిపిస్తున్నది. నాలుగు సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న 22 మంది డైరెక్ట‌ర్ల‌ను మూకుమ్మ‌డిగా తొల‌గించి 17 నెల‌లు అవుతున్నా ఇంత వ‌ర‌కు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం గమనార్హం. పూర్తిస్థాయి డైరెక్టర్‌లు లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లతోనే కీల‌క‌మైన‌ సంస్థ‌ల‌ను నెట్టుకువ‌స్తున్నారు. భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసిన‌ ఏడాది త‌రువాత సెలెక్ష‌న్ క‌మిటీ ఇంట‌ర్వ్యూలు కూడా నిర్వ‌హించింది. ఈ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ఎవ‌రి స్థాయిలో వారు పైర‌వీలు చేసుకుంటున్నారని సమాచారం.

గత ఏడాది జనవరిలో మూకుమ్మడి తొలగింపులు

గ‌త ప్ర‌భుత్వం ట్రాన్స్‌కో( Transco ), జెన్కో( Genco ) డైరెక్ట‌ర్లు, ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నియామ‌కంలో నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను ప‌రిశీలించిన ప్ర‌భుత్వం.. 2024 జ‌న‌వ‌రి 27న వారిని తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ త‌రువాత తెలంగాణ ఉత్త‌ర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL), తెలంగాణ ద‌క్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డైరెక్ట‌ర్ల‌ను కూడా తొల‌గించింది.

తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ (టీజీ జెన్కో) లో ఐదు డైరెక్ట‌ర్ ప‌ద‌వులు, తెలంగాణ విద్యుత్‌ ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ (టీజీ ట్రాన్స్‌కో) లో మూడు డైరెక్ట‌ర్ ప‌ద‌వుల భ‌ర్తీ కోసం గ‌తేడాది జ‌న‌వ‌రి 29న నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. మార్చి నెల 1వ తేదీ చివ‌రి గ‌డువుగా నిర్ణ‌యించారు. టీజీ ట్రాన్స్‌కోలో డైరెక్ట‌ర్ (గ్రిడ్ అండ్ ట్రాన్స్‌మిష‌న్ మేనేజ్‌మెంట్‌), డైరెక్ట‌ర్ (ప్రాజెక్ట్స్‌, డైరెక్ట‌ర్ (ఫైనాన్స్‌), జెన్కో లో డైరెక్ట‌ర్ (హైడ‌ల్‌), డైరెక్ట‌ర్ (హెచ్ఆర్‌ అండ్ ఐఆర్‌), డైరెక్ట‌ర్ (కోల్ అండ్ లాజిస్టిక్స్‌), డైరెక్ట‌ర్ (ఫైనాన్స్ అండ్ క‌మ‌ర్షియ‌ల్‌) ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు. ఈ ప‌ద‌వి కోసం పోటీప‌డేవారు విద్యుత్ పంపిణీ సంస్థ‌ల్లో క‌నీసం 15 సంవ‌త్స‌రాల అనుభ‌వం కలిగి ఉండాల‌ని, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల‌లో క‌లిపి క‌నీసం 25 సంవ‌త్స‌రాలు అనుభ‌వం ఉండాల‌ని ష‌ర‌తు విధించారు. వ‌య‌స్సు 65 ఏళ్లు దాట‌కుండా, చీఫ్ ఇంజినీర్‌, చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా గ‌త మూడేళ్ల నుంచి విధుల్లో ఉండాలి.

ఇంట‌ర్వ్యూలు నిర్వహించిన సెలక్షన్‌ కమిటీ

తెలంగాణ ఇంధ‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలోని సెలక్ష‌న్ క‌మిటీ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ప్ర‌తి డైరెక్ట‌ర్ ప‌ద‌వికి ముగ్గురు పేర్ల‌తో షార్ట్ లిస్టు చేసి ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేస్తుంది. ఈ క‌మిటీలో విద్యుత్ సంస్థ‌ల సీఎండీలు, ప్ర‌భుత్వం నామినేట్ చేసే ఇంధ‌న‌రంగ స్వ‌తంత్ర నిపుణుడు స‌భ్యుడిగా ఉంటారు. ఈ మేర‌కు ఏప్రిల్ 9, 10వ తేదీల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించింది. 9వ తేదీన ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ‌లు, 10వ తేదీన ట్రాన్స్‌కో, జెన్కో సంస్థ డైరెక్ట‌ర్ల ఎంపిక‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ఆ ముగ్గురిలో ఒక‌రిని డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసి ప్ర‌క‌టిస్తారు. ప‌ద‌వీకాలం రెండు సంవ‌త్స‌రాలుగా నిర్ణ‌యించారు. ప‌నితీరు బాగా ఉన్న‌ట్ల‌యితే సెలెక్ష‌న్ క‌మిటీ సిఫార‌సు తో మ‌రో ఏడాది పొడిగించ‌నున్నారు. మొత్తం ఎనిమిది డైరెక్ట‌ర్ ప‌ద‌వుల కోసం 152 ద‌ర‌ఖాస్తులు అందాయి. రైల్వే శాఖ‌, నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌, సింగ‌రేణితో పాటు దేశంలో ప‌లు విద్యుత్ సంస్థ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు, రిటైర్డు ఇంజ‌నీర్లు పోటీప‌డుతున్నారు. వీరితో పాటు తెలంగాణ విద్యుత్ సంస్థ‌ల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న చీఫ్ ఇంజ‌నీర్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌ద‌వుల కోసం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ఎవ‌రికి వారుగా లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, స‌ల‌హాదారుల ద్వారా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారిని, కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తున్న‌వారిని తొల‌గించాల‌ని ఆదేశించ‌డంతో ప‌నిచేస్తున్న ఇన్‌చార్జ్‌ డైరెక్ట‌ర్ల‌ను తొల‌గించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే డైరెక్ట‌ర్ ప‌ద‌వులు భ‌ర్తీ చేసే వ‌ర‌కు పాత‌వారిని కొన‌సాగించాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీ చేశారు.