Andhra University Students Protest | ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్రిక్తత!
ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మణికంఠ మృతి ఉద్రిక్తత రేపింది. వీసీ రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనల్లో దిగగా, మంత్రి లోకేష్ స్పందించారు.

అమరావతి : ఏపీలోని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో రెండో రోజు విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి విజయమూరి వెంకట సాయి మణికంఠ (25) మృతితో యూనివర్సిటీలో నిరసనలు రేగాయి. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తరగతులను, పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు క్యాంపస్ బంద్ కు పిలుపు ఇచ్చి ర్యాలీ నిర్వహించారు. వీసీ ఛాంబర్ ను ముట్టడించిన విద్యార్థులు వీసీ ఛాంబర్ లోకి దూసుకెళ్లారు. రిజిస్టార్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన చేపట్టారు.
విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట నెలకొని ఉద్రిక్తత ఏర్పడింది. వీసీ రాజీనామా చేయాలని..మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్ధిని మణికంఠకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
శాతవాహన హాస్టల్ బాత్రూంలో అపస్మారక స్థితిలో కుప్పకూలిన మణికంఠ కోసం వెంటనే వర్సిటీ అధికారులు అంబులెన్స్ పిలిపించారు. కానీ అంబులెన్స్‌లో ఆక్సిజన్, ప్రాథమిక వైద్య పరికరాలు లేకపోవడంతో అతని పరిస్థితి మరింత విషమించింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు తరలిస్తుండగానే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ డిస్పెన్సరీలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్లే మణికంఠ ప్రాణాలు పోయాయని అంటున్నారు. హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, అత్యవసర సమయంలో వైద్య సిబ్బంది స్పందన లేకపోవడం మరింత కోపాన్ని రేకెత్తిస్తోంది.
విద్యార్థుల నిరసనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అనవసర ఆందోళనలతో రాజకీయం చేస్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్‌లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తాం. 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటంచారు.