తల్లి, చెల్లితో జగన్ రాజీ యత్నం?

ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచింది. మరోవైపు తెలంగాణలోనూ తాజాగా బలమైన బీఆరెస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత ముందు మోదీ, కేసీఆర్‌ వంటివారు నిలువలేక పోయారు

తల్లి, చెల్లితో జగన్ రాజీ యత్నం?
  • తెలంగాణ దెబ్బతో ఏపీ సీఎం ముందు జాగ్రత్త!
  • డీకేతో రాయ‌బారం నెరిపిన వైఎస్‌ జగన్‌?
  • షర్మిలకు కడప ఎంపీ.. తల్లికి కమలాపురం!
  • ఇద్దరూ పార్టీలోకి రావాలని ఆహ్వానం
  • మనుమడి పెళ్లి తర్వాత మాట్లాడుదాం..
  • ప్రతిపాదన రాగానే దాటేసిన విజయమ్మ?
  • ఏపీపై కర్ణాటక, తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌
  • కొత్త ఉత్సాహంతో ఏపీ కాంగ్రెస్‌ నేతలు
  • రెండోసారి అధికారం కోసం జగన్‌ యత్నాలు
  • కొండలా ఢీకొంటున్న ప్రజా వ్యతిరేకత
  • అందుకే తల్లి, చెల్లికి ఆహ్వాన వ్యూహం?


విధాత ప్రత్యేకం: ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచింది. మరోవైపు తెలంగాణలోనూ తాజాగా బలమైన బీఆరెస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత ముందు మోదీ, కేసీఆర్‌ వంటివారు నిలువలేక పోయారు. సహజంగానే ఇవి ఏపీ రాజకీయాలపై, ప్రత్యేకించి కొద్ది నెలల్లో జరుగనున్న ఎన్నికలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది. ప్ర‌స్తుత ఏపీ శాస‌న‌స‌భ‌లో 175 స్థానాల‌కుగాను 151 స్థానాల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే.. ఒంటెత్తు పోక‌డ‌లు, తాడేప‌ల్లి ప్యాలెస్ దాటి వెళ్ల‌క‌పోవ‌డం, స‌చివాల‌యానికి రారనే అపప్రథలు జగన్ మోహ‌న్‌రెడ్డి పట్ల ఏపీ ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.


ప్రత్యేకించి ఉద్యోగ వర్గాలు జగన్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నదనేది బహిరంగ రహస్యమే. ఎన్నికల నాటికి ఇది విస్ఫోటం చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తాను దూరం చేసుకున్న చెల్లి షర్మిలను, తల్లి విజయమ్మను మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని తెలుస్తున్నది. దీనితోపాటు తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో త్వ‌ర‌లో విలీనం చేస్తారన్న సంకేతాలతో జగన్‌ వేగంగా పావులు కదిపినట్టు ప్రచారం జరుగుతున్నది.


మళ్లీ పుంజుకునే యత్నాల్లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఘోరంగా దెబ్బతిన్నది. కోలుకుంటుందా? లేదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో అటు కర్ణాటకలోనూ, తాజాగా తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారం సాధించడం ఏపీ నేతలకు కొత్త శక్తినిచ్చిందని చెబుతున్నారు. తెలంగాణ ఫలితాన్ని ఏపీలోనూ రిపీట్‌ చేయాలనే ఉద్దేశంతో ఉన్న అధిష్ఠానం షర్మిలను ఏపీ ఎన్నికల ప్రచారంలోకి దింపి, వైఎస్‌ అభిమానులను మళ్లీ కాంగ్రెస్‌ గూటికి తెప్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.


ఈ క్రమంలోనే డిసెంబర్‌ మూడో వారంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై చర్చలు పునఃప్రారంభం కానున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన బలమైన పార్టీలుగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా పుంజుకుంటే జగన్‌కు కోలుకోలేని షాక్‌ తగలడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. దాన్నుంచి తప్పించుకునేందుకు చెల్లి షర్మిలను, తల్లి విజయమ్మను మళ్లీ చేరదీసి, తగిన గౌరవం కల్పించడం తప్ప మరో మార్గం లేదని జగన్‌ సన్నిహిత వర్గాలు కూడా ఆయనకు నచ్చచెప్పాయని తెలుస్తున్నది.


డీకే నే సమర్థుడు!

ఇంతటి కీలక బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశం ముందుకు వచ్చినప్పుడు వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్ణాటక కాంగ్రెస్‌ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఎంచుకున్నారని సమాచారం. విజయమ్మతో, షర్మిలతో రాజీ కుదర్చాలని డీకేని జగన్‌ కోరారని తెలుస్తున్నది. తిరిగి పార్టీలోకి వస్తే కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తన తల్లికి ఇస్తానని, కడప పార్లమెంటు సీటును చెల్లి షర్మిలకు కేటాయిస్తానని ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనపై విజయమ్మను ఒప్పించాలని కోరారని ప్రచారం జరుగుతున్నది.


ప్రస్తుతం కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క‌మ‌లాపురం నుంచి మరోసారి ర‌వీంద్రనాథ్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చెబుతున్నారు. విజయమ్మ ఇక్కడి నుంచి పోటీ చేస్తే జనం సానుకూలంగా స్పందిస్తారనేది జగన్‌ ఆలోచనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇక కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి విషయంలోనూ జగన్‌ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. తన బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్‌కు మరక అంటుకున్నది. ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్న‌ది. హైకోర్టు బెయిల్‌పై ఉన్న అవినాశ్‌తో తన ప్రతిష్ఠకూ మసక ఏర్పడిందనే భావనతో జగన్‌ ఉన్నట్టు సమాచారం. ఈ మ‌చ్చ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో పాటు, కాంగ్రెస్‌ పుంజుకోకుండా చూడటం, రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం అనే లక్ష్యాలతో శివకుమార్‌తో రాయబారం నడిపించినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.


అయితే.. ట్విస్ట్‌ ఏమిటంటే.. డీకే ఫోన్‌ చేస్తే మాట్లాడిన విజయమ్మ.. కొద్దిసేపు యోగక్షేమాలు తెలుసుకున్నారని, ఆ తర్వాత జగన్‌ చేసిన ప్రతిపాదనను మాటలో మాటగా డీకే ముందుకు తెచ్చారని, ఊహించని ప్రతిపాదన కావడంతో తన మనుమడు, షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి తర్వాత మాట్లాడుదాం అంటూ వెంటనే ఫోన్‌ కట్‌ చేశారని చెబుతున్నారు.



డీకే ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు?

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నారా లేదా వైసీపీ పంచాయితీని పరిష్క‌రించేందుకు ప‌నిచేస్తున్నారా అనే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అధినాయ‌క‌త్వం ఆయ‌న‌కు స‌ముచిత గౌర‌వం ఇస్తూ కీల‌క‌ శాఖ‌ల‌ను అప్ప‌గించింది. అదే విధంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపులో ఆయ‌న‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చింది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, ఏపీ ఎన్నికల ప్రచారానికి షర్మిల, విజయమ్మతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సైతం వినియోగించాలనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్న సమయంలో డీకే శివకుమార్‌.. జగన్‌ తరఫున విజయమ్మతో రాయబారం నెరిపినట్టు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఏపీలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తెప్పించాలనుకునే ప్రయత్నాలు జరుగుతుంటే డీకే స్వయంగా ఈ పంచాయితీలోకి దిగారన్న వార్తలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.