గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజ‌య ఢంకా మోగించిన వైఎస్సార్‌సీపీ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో గ‌డ్డు ఫ‌లితాల‌ను చ‌విచూడ‌నుందా?

*నానాటికీ బ‌ల‌ప‌డుతున్న టీడీపీ-జ‌న‌సేన‌

* తాజా స‌ర్వేలో 136 అసెంబ్లీ 18 ఎంపీ స్థానాలు

* జ‌గ‌న్ పార్టీ సీట్లు 60 దాట‌వంటూ జోరుగా బెట్టింగులు

* బీజేపీతో ప్ర‌త్య‌క్ష పొత్తుకు టీడీపీ-జ‌న‌సేన విముఖం?

* ఆరు ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్న బీజేపీ

* ష‌ర్మిల ఎంట్రీతో మ‌రిన్ని క‌ష్టాల్లోకి జ‌గ‌న్ అండ్ కో

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి: గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజ‌య ఢంకా మోగించిన వైఎస్సార్‌సీపీ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో గ‌డ్డు ఫ‌లితాల‌ను చ‌విచూడ‌నుందా? గ‌డిచిన నాలుగ‌న్న‌రేళ్ల కాలంలో ఏపీలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి లేక‌పోవ‌డం, ఉన్న ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోవ‌డం, ఉద్యోగుల్లో పూర్తిస్థాయి వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకోవ‌డం, మూడు రాజ‌ధానుల పేరుతో ఏ ఒక్క రాజ‌ధానిని ఖ‌రారు చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో జ‌గ‌న్ పార్టీకి జ‌నం వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ గుణ‌పాఠం చెప్ప‌డానికి సిద్ధ‌ప‌డినట్లు తాజా స‌ర్వేలు చెబుతున్నాయి. జ‌గ‌న్ న‌మ్ముకున్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆటో, ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణుల‌కు అంద‌స్తున్న సాయం కంటే పెంచిన రేట్ల వ‌ల్ల ఫ్యామిలీ బ‌డ్జెట్ గుల్ల‌యిపోయింద‌న్న ఆవేద‌న ప్ర‌జ‌ల్లో క‌న‌బ‌డుతోంది. ఏపీలో రోడ్ల ప‌రిస్థితిపై జాతీయస్థాయిలో ప‌రువుపోయింది కూడా. ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తున్నా ఫ‌లితం ఉండ‌ద‌నే అభిప్రాయం స‌ర్వేల్లో వెల్ల‌డైంది. పెరిగిన క‌రెంటు ఛార్జీలు, ఇంటి ప‌న్నులు, నెల స‌రుకుల ధ‌ర‌ల మోత‌, ఉద్యోగుల‌కు పీఆర్‌సి ఇవ్వ‌క‌పోవ‌డం, సిపిఎస్ ర‌ద్దు చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాలు వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 60 సీట్ల‌కు మించి రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.

సర్వేల్లో టీడీపీ-జనసేన కూటమికే ఆధిక్యం

తాజా స‌ర్వేల్లో జ‌గ‌న్ పార్టీ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంటే, టీడీపీ-జ‌న‌సేన సీట్ల సంఖ్య 136కు పెరిగింద‌ని వెల్ల‌డైంది. పార్టీల అంత‌ర్గ‌త స‌ర్వేల్లోనూ దాదాపు ఇదే ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. బెట్టింగుల‌కు పేరుమోసిన భీమ‌వ‌రం- సొంత స‌ర్వేలో సైతం జ‌గ‌న్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు 60 కూడా రావ‌ని తేలింది. దీంతో ప్ర‌స్తుతం బెట్టింగు రాయుళ్లు వైసీపీకి 60 సీట్లు దాట‌వ‌నే పాయింటుతో పందెం కాస్తున్నార‌ని స‌మాచారం. టిడిపి కూట‌మి గెలుస్తుంద‌ని పందెం వేయ‌డానికి ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతున్నార‌ని, వైసీపీ గెలుస్తుంద‌ని పందెం కాసేవారు అతి త‌క్కువ‌గా ఉన్నార‌ని భీమ‌వ‌రం బెట్టింగ్ బ్యాచ్ చెబుతోంది. టిడిపి-జ‌న‌సేన గెలుస్తుంద‌ని ఎంత‌యిన పందెం కాయ‌డానికి రెడీగా ఉన్నాన‌ని, ఎవ‌రైనా వైసీపీ గెలుస్తుంద‌ని పందెం కాసేవారంటే రావొచ్చంటూ హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన ఒక భీమ‌వ‌రం వ్యాపారి వైసీపీ క్లోజ్ సర్కిల్స్‌లో ఛాలెంజ్ చేసి వారం దాటినా ఇంకా ఎవ‌రూ ముందుకు రాలేద‌ని చెబుతున్నారు.

బీజేపీతో పొత్తుపై టీడీపీ విముఖత

బీజేపీతో పొత్తు విష‌యంలో కూడా టీడీపీ ఆచితూచి అడుగులేస్తోంద‌ని, పొత్తు లేక‌పోతేనే మంచిద‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఏపీలో టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తు కావాల‌ని బ‌లంగా కోరుకుంటోంద‌ని, ఆరు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంద‌ని టీడీపీకి చెందిన కీల‌క వ్య‌క్తి ఒక‌రు వెల్ల‌డించారు. అవేవీ సాధ్యం కాని ప‌క్షంలో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కోసం రాజ‌మండ్రి ఎంపీ సీటు కేటాయించాల‌ని కూడా బేరం పెట్టిన‌ట్లు ఆయ‌న విధాత‌కు చెప్పారు. రాయ‌ల‌సీమ వ‌దిలేసినా కూడా టీడీపీ-జ‌న‌సేన‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సీట్లు గెలుచుకుంటార‌ని, రాయ‌ల‌సీమ‌లో వ‌చ్చే సీట్లు బోన‌స్ లాంటివ‌ని వైసీపీ అసంతృప్త నేత ఒక‌రు వెల్ల‌డించారు. అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం వ‌ల్ల జ‌గ‌న్ త‌న ఓట్ల శాతాన్ని మ‌రింత త‌గ్గించుకుంటున్నార‌న్నారు.

షర్మిలతో వైసీపీకి దెబ్బ

ఇక ఏపీ అధ్య‌క్షురాలుగా వైఎస్ ష‌ర్మిల చేర‌డం, ఆమె జిల్లా ప‌ర్య‌ట‌న‌లు, పాద‌యాత్ర‌లు జ‌గ‌న్ పార్టీని ఊహించని దెబ్బ కొడ‌తాయ‌ని స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌గా ష‌ర్మిల మాట్లాడుతున్న మాట‌ల‌కు, లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు వైసీపీలోని వారే ఆలోచ‌న‌లో ప‌డేట‌ట్లు ఉన్నాయని కూడా ఈ స‌ర్వేల్లో వెల్ల‌డ‌యిందంటున్నారు. క‌డ‌ప ఎంపీ సీట్లో ష‌ర్మిల‌కానీ, వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌కానీ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తే ఆ సీటు కూడా కోల్పోవాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ వివేకానంద‌రెడ్డి భార్య ఇండిపెండెంట్‌గా ఎంపీ ప‌ద‌వికి పోటీ చేసినా గెలిచిపోతుంద‌ని కూడా స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మైందంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో వైసీపీ అసంతృప్తులంతా ష‌ర్మిల పార్టీలో చేరుతుండ‌టం, వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా బ‌రిలో దిగుతుండ‌టంతో వైసీపీ ఓటు బ్యాంకులోనే భారీ చీలిక త‌ధ్య‌మంటున్నారు.

మూడు గంటల పాటు సాగిన చంద్రబాబు-పవన్‌ల భేటీ

టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల పంపకంకు సంబంధించి రెండు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌లు ఆదివారం కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు గంటల పాటు వారి భేటీ సాగింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల పరిష్కారం దిశగా వారిద్దరు చర్చించి ఒక స్పష్టతకు వచ్చినట్లుగా సమాచారం. టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి..? అనే విషయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీడీపీ జ‌న‌సేన పొత్తులో భాగంగా ఈసారి జ‌న‌సేన‌కు 25 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈసారి ఒక్క భీమ‌వ‌రం నుంచే పోటీలో ఉంటార‌ని కూడా స‌మాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచార సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని.. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Subbu

Subbu

Next Story