Deputy CM pawan Kalyan | పుష్ప సినిమాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పరోక్ష విమర్శలు.. అడవులు నరికేయడం హీరోయిజమైపోయిందని వ్యాఖ్య
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగుళూరు పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగుళూర్ పర్యటనలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రే తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల రక్షణకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గతంలో 40ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని, రాజ్‌కుమార్ గంధడ గుడి సినిమా నిదర్శమని కాని ఇప్పుడొస్తున్న సినిమాలో గొడ్డళ్లు పట్టుకుని అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజమైందన్నారు. సినిమా కల్చరల్ వచ్చిన మార్పులకు ఇది నిదర్శమని, అయితే రీల్ లైఫ్‌కు రియల్ లైఫ్‌కు తేడా ఉంటుందన్నారు.
కాగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై సైటర్లుగా భావిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ ప్రచారానికి హాజరుకావడం, తన ప్రచారానికి రాకపోవడంతో పాటు అల్లు, మెగా కుటుంబాల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు సాగుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప సినిమాపై సెటైర్లుగా అల్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అటవీ, వన్యప్రాణిల సంరక్షణపై కీలక చర్చలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక పర్యటనలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు రెండు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై కీలక చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య విస్తరించి వున్న అడవుల సంరక్షణతో పాటు జనావాసాలపై, పంటలపై ఏనుగుల దాడికి నివారణకు కుంకీ ఏనుగుల ఒప్పందం సహా పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ చర్చించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖంద్రే పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలన్న ఆలోచన నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని పవన్ కల్యాణ్ కోరారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా పాల్గొన్నారు.