VIRAL: కాటేసిన తాచుపాముని మెడలో వేసుకుని వీరంగం
మద్యం మత్తులో తాచుపామును పట్టుకుని మెడలో వేసుకుని వీరంగం సృష్టించిన వ్యక్తి మరోసారి కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విధాత: మద్యం మత్తులో ఓ వ్యక్తి పాముతో చలగాటాలాడాడు. కాటు వేసిన తాచు పాముని మెడలో వెసుకుని వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి కొండ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో కోడి గుడ్డు కోసం కోళ్లను ఉంచిన గంప దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఉన్న తాచుపాము అతన్ని కాటు వేసింది. దీంతో కాటేసిన పాముని పట్టుకుని నన్నే కాటేస్తావా అంటూ దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రామస్థులు అతన్ని పాముని వదిలి పెట్టమని కోరగా అతను పామును వారి మీదకు విసురుతున్నట్లు చేసి భయ భ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో పాము అతన్ని మరో సారి కాటేయండంతో స్థానికులు అతని నుంచి పామును వేరు చేసి దాన్ని చంపి కొండను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.