ఏపీ సీఎం జగన్ సిద్దం అంటాడని ... దేనికి సిద్దం..? జైలుకి వెళ్లడానికి సిద్ధమా? సొంత బాబాయ్‌ని లేపేశారని.. ఇంకెంత మందిని లేపేయడానికి సిద్దం? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

  • ఎన్నికల ముందు డీఎస్సీతో జగన్నాటకం
  • పైన బటన్‌ నొక్కుడు...కింద చార్జీల బాదుడు
  • ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం
  • టీడీపీ శంఖారావంలో సభలో నారా లోకేశ్‌

Nara Lokesh | విధాత : ఏపీ సీఎం జగన్ సిద్దం అంటాడని ... దేనికి సిద్దం..? జైలుకి వెళ్లడానికి సిద్ధమా? సొంత బాబాయ్‌ని లేపేశారని.. ఇంకెంత మందిని లేపేయడానికి సిద్దం? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇచ్ఛాపురంలో టీడీపీ శంఖారావం యాత్రం ప్రారంభోత్సవ సభలో నారా లోకేశ్‌ ప్రసంగించారు. ఎర్రబుక్కు చూసి వైసీపీ అవినీతి పరులంతా భయపడుతున్నారన్నారు. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదని విశాఖపట్నంలో తహసీల్దార్ రమణయ్యను కొట్టి చంపారని ఆరోపించారు.

చంద్రబాబుతో పాటు నాపై ఎన్నో దొంగకేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ ఉన్నాయని, వారిపై న్యాయవిచారణ జరిపిస్తామని, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదలబోమని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తామని లోకేశ్ అన్నారు. సీఎం జగన్‌ పైకి బటన్ నొక్కుతానంటాడు.. కింద చార్జీల బాదుడు వేసి వెనక్కి లాగేస్తాడని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే 100 సంక్షేమ పథకాలు జగన్‌ కోత పెట్టాడని, రెండు నెలలు ఓపిక పట్టండని, టీడీపీ అధికారంలోకి రాగానే వాటిన్నింటిని పునరుద్ధరస్తామన్నారు. ఉత్తరాంద్ర అమ్మ లాంటిదని పేర్కొన్నారు. టీడీపీ ఉత్తరాంధ్రని జాబ్ కేపిటల్‌గా చేస్తే.. సైకో జగన్.. ఉత్తరాంధ్రని గంజాయి క్యాపిటల్‌గా మార్చేశాడని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ డీఎస్సీ పేరుతో కొత్త నాటకం మొదలెట్టారని, మోసానికి, కుట్ర, దగాకి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్‌లా ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 17 వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్‌ ఇప్పుడు 6 వేలు అంటున్నారని దుయ్యబట్టారు.

ఎన్‌టీఆర్‌, చంద్రబాబులు హయాంలో 1లక్ష 70వేలటీచర్ పోస్ట్‌లను భర్తీ చేశారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అప్పుడు ఏటా డీఎస్సీ వేస్తామన్నారు. జగన్‌కు మైథోమానియా సిండ్రోమ్ అనే జబ్బు ఉందన్నారు. సొంత సంస్థ లు ఉన్నవారు పేదవారవుతారా? షర్మిల, సునీతలకే భద్రత లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్’’ అని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.

అధికారంలోకి రాగానే 20లక్షల ఉద్యోగాలు

టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు 3 వేలు అందిస్తామని నారా లోకేశ్‌ ప్రకటించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. విశాఖ ఉక్కు భూములను కాజేయాలని చూస్తున్నారని, శ్రీకాకుళంకు 60 హామీలు ఇచ్చారని, ఓక్కటైనా జగన్‌ పూర్తి చేసారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. మాట ఇచ్చి మడమ తిప్పాడని విమర్శించారు. ఐదేళ్లలో ఇచ్చాపురానికి వైసీపీ చేసిందేమి లేదని, టీడీపీ రాగానే వంశధార -బాహుదా నదుల అనుసంధానం చేస్తామని,. ఉద్దానానికి నీరందిస్తామని, జీడి పంటకు మద్దతు ధర కల్పిస్తామని లోకేశ్‌ హామీలిచ్చారు.

విభేదాల సృష్టిపై అప్రమత్తంగా ఉండాలి

టీడీపీ-జనసేనల మధ్య విభేదాలు వచ్చేలా చూస్తున్నారని, ఫేక్ పోస్ట్‌ల పట్ల, వైసీపీ పేటీఎం బ్యాచ్‌లతో జాగ్రత్త రెండు పార్టీల నేతలు జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ సూచించారు. సైకో జగన్‌ని శాశ్వతంగా తాడేపల్లి ఇంట్లో పెడదామన్నారు. రాష్ట్ర పరిస్థితులు ఏలా ఉన్నాయో మీకు తెలుసని, కష్టకాలంలో నాకు అండగా ఉన్న వ్యక్తి పవన్ అని, చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్‌ను ఏపీకి రాకుండా అడ్డుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ-జనసేనదనన్నారు.

Updated On 12 Feb 2024 1:50 AM GMT
Somu

Somu

Next Story